మనిషి మాట్లడే జంతువని ఒక చమత్కారవంతమైన వ్యాఖ్య ఉంది. సంభాషించడం అనేది మనిషికి అంత కీలకమని మనం గమనించాలి. సాంకేతిక విధానం పరిఢవిల్లిన తర్వాత ముఖాముఖి మాత్రమే మాట్లాడనవసరం లేదు, సమాచార ప్రసారసాధనాలు పెరుగుతూ వచ్చాయి.
రచయితలకు, కళాకారులకూ సంభాషించడం మరింత ముఖ్యం. అందులో భాగంగానే వారి సృజనాత్మక ప్రక్రియలు వాహికలుగా మారిపోతాయి. ఎలెక్ట్రాన్ ను ఊతంగా తీసుకొని మనిషి దూరాన్ని సులువుగా లంఘిస్తున్నాడు. ఫలితంగా ప్రాంతం అనే పరిమితిని అధిగమిస్తున్నాడు. అటువంటి వెసులుబాటు ’బ్లాగ్స్’ ద్వారా లభిస్తోంది. కేవలం సముద్రాలకావల ఉన్నవారినేకాదు, మన దేశంలోనే ఇతర ప్రాంతాలలో ఉన్న వారిని చేరడం అంత సులువు కాదు. మనకు తీరిక ఉన్నపుడు ఆ వ్యక్తికి సమయం ఉండక పోవచ్చు. అందువల్ల ఫోన్ ప్రతిసారీ ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు.
ఇక ఒక్కసారి నా గురించి... నా తొలి రచన చిన్న కవిత 1978 లో ఆంధ్రపత్రికలో ప్రచురింపబడింది. అప్పట్లో నేను పదవ తరగతి విధ్యార్థి. 1988 లో ఆకాశవాణీ లో ఉద్యోగంలో చేరాను. 1986 లో తొలి వ్యాసం ’ఆంధ్రప్రభ’ లో ప్రచురణకు ముందు చిన్నాచితక రచనలు కొన్ని ప్రచురింపబడ్డాయి. అంతకుముందే శ్రీ వేంకటేశ్వర విశ్వవిధ్యాలయంలో భౌతికశాస్త్రంలో ఎం ఏస్సీ పూర్తి అయ్యింది. ఒక వైపు భౌతిక శాస్త్ర పరిశోధన మరో వైపు రచనావ్యాసంగం దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. ఉద్యోగరీత్యా గోవాలో మూడేళ్ళు పని చేసిన తరువాత 1991 లో ఆంధ్రదేశం వచ్చాక నా రచనల సంఖ్య పెరిగింది. తొలుత కథలు, కవితలు పడినా పిమ్మట దాదాపు ఒక దశాబ్దం పాటు సైన్స్ రచనలు సాగాయి. 1997 లో తెలుగు టీవీ కార్యక్రమాల విశ్లేషణ ప్రారంభమై ఆంధ్రభూమిలో ఒక పుష్కరం పాటు నిరాఘాతంగా సాగింది. మరో వైపు 1999 లో పర్యావరణం మీద శీర్షిక ప్రారంభమై రెండేళ్ళు వార్తలో నడిచింది అదే ’ప్రకృతి-వికృతి’. 2007 లో వార్తా పత్రికల మీద ’మీడియానాడి’ మొదలైంది. వీటన్నిటితో పాటు సాహిత్యవ్యాసాలు అడపాదడపా వస్తున్నాయి, అలాగే సైన్స్ వ్యాసాలు కూడా! మరి పుస్తకాల వివరాలు కూడా ఇదే బ్లాగ్ లో బుక్స్ లింక్ లో లభిస్తున్నాయి.
అయితే పలు పత్రికలలో వివిధ శీర్షికలు రాసేవారికి సమస్య ఉంటుంది. ఫలానా రచయితను చదవాలనే వారికి - ఆయా పత్రికలు లభించకపోవచ్చు. కేవలం ఒక అంశం కోసం ఆ పత్రికను కొనడం సాధ్యం కాకపోవచ్చు, లేదా ఆ పత్రిక దొరక్కపోవచ్చు. వీటికి మించి మరోసమస్య కూడా ప్రస్తుతం తీవ్రమవుతోంది. మనం మరింత ఆధునికమవుతున్నామని భావిస్తుంటాం. అయినా ఆలోచనల మధ్య, వాదాల మధ్య, సిద్దాంతాల మధ్య సామరస్యం తగ్గుతోంది, సమాంతర గళాలకు వేదికలు తగ్గిపోతున్నాయి. ఈ నేపధ్యం లో బ్లాగ్స్ చక్కగా ఉపకరిస్తాయి. అదే సమయంలో పాటకుల స్పందన అక్కడే దర్శనమిస్తుంది. అది కూడా రచయిత రచనతో పాటు డాక్యుమెంట్ అవుతుంది. అందువల్ల వివిధ పత్రికల్లో కనబడే నా రచనలు ఇకనుంచి ఇందులో మీరు చదువుకోవచ్చు, స్పందించవచ్చు. (తాజాకలం: ఈ బ్లాగ్ కు ఎలెక్ట్రానిక్ రాళ్ళెత్తిన మా నాగసూరి కార్తీక్ కు - నాగసూరి వేణుగోపాల్ కృతఙ్నతలతో....)
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
బ్లాగ్లోకానికి సుస్వాగతం...
మొత్తం మీద తెలుగు బ్లాగుల్లోకి అడుగుపెట్టారు,స్వాగతం.రెండేళ్ళ క్రితం ఈ బ్లాగులంటే ఆసక్తి లేదన్నారు గుర్తుందా?
ఇక్కడ కూడా మీ గురించి లంకె ఇచ్చాము చూడగలరు
http://vizagdaily.info/?p=1934
బ్లాగు లోకానికి స్వాగతం , మిమ్ములను బ్లాగు మాద్య మం ద్వారా చూడటం ఆనందంగా వున్నది , వీలును బట్టి
తెలుగు వికీపీడియాలో కూడా రాయమని విన్నపము
బ్లాగులోకానికి స్వాగతం.. ఇకపై పత్రికల్లో వచ్చే మీ వ్యాసాలన్నీ మీ బ్లాగులో చూడవచ్చన్న మాట! అన్నట్టు మీ బ్లాగు పేరు సైన్సు పట్ల మీకున్న అభిమానాన్ని సూచిస్తోంది...
Aalasyanga spandistunnanduku kshaminchali
JYOTHY,bloglokam word meeku natchindi kadoo...
RAJENDRA KUMAR DEVARAPALLI,marosari eevishayam charchinchukundam...
KRUPAL KASYAP,alaage methrama...
MURALI,avunu meeru cheppindi correct...
Post a Comment