టీవీ అవార్డులు ఎందుకు?

on Sunday, August 22, 2010




టీవీ-9 చాలా హడావుడిగా 2007లో సంస్కృతి చానల్ ప్రారంభించి ప్రపంచంలోనే తొలి సర్వమత చానల్ అని చెప్పుకుంది. ఎన్‌టివి వారి భక్తికన్నా ముందుండాలని చాలా శ్రమపడింది. అయితే అంతే హడావుడిగా ఒకటిన్నర సంవత్సరంలోపు కారణం వీక్షకులకు చెప్పకుండా టీవీ-1గా పేరుమారింది. ఒకవైపు వార్తా చానల్ అనిపించేలా కొన్ని కార్యక్రమాలు, ఆదాయం కలిగించగలవనే ప్రసారాలు, స్వామీజీల భక్తి ప్రసంగాలు ప్రసారం చేస్తోంది. అయితే ఏదైనా వెగటు పుట్టించేలా చేయడం టీవీ-1 ధోరణి కావచ్చు. పాత పాటలకు చౌకబారు పారడీలు చేయడం అలవాటైంది. అంతకుమించి ఇతర చానళ్ల కార్యక్రమాలను నగుబాటు చేస్తూ ప్రయోగాలు చేస్తోంది. కేవలం ఈటీవీ, జెమినీ మాత్రమే వున్నప్పుడు ‘కళంకిత’ను ‘శోకంకిత’ అంటూ వెటకారం చేసిన కార్యక్రమాలున్నాయి. కానీ ఇటీవల ఆ ధోరణి ఇతర చానళ్లలో లేదు. జీ తెలుగు ప్రాచుర్యంలో బాలకోయిలలు కార్యక్రమం సాగితే ఆ పిల్లలతో గంటలకొద్దీ కార్యక్రమాలు చేసే టీవీ-9 ఎక్కడ టిఆర్‌పి లుంటే అక్కడికే వెడుతుంది. మామూలుగా ఇతర మీడియా సంస్థల గురించి వార్తలు ఇచ్చే విధానంనం లేకుండా స్థిరపడింది. అటువంటి చోట తమకు లాభం కలిగించే రీతిలో ఒకసారి, మరోసారి ఇతరులను గేలి చేసే రీతిలో కార్యక్రమం చేయడం టీవీ-9 విధానం కావచ్చు. ఇతర మీడియా సంస్థలు కూడా సెటైర్లు వేయడం ప్రారంభిస్తే యెటకారం డాట్ ఢాం అవుతుంది. టీవీ-1 విధానం తప్పకుండా మార్చుకోవాల్సి వుందేమో!
* * * *
కాశ్మీర్‌లో ఒక వార్త ప్రసారం కారణంగా హెడ్‌లైన్స్‌టుడే వార్తచానల్‌పై కేసు ఆగస్టు మొదటి వారంలో నమోదైంది. అంతకు నెలముందు అసత్య వార్త ప్రసారం చేసారని న్యూస్‌ఎక్స్ చానల్‌పై కేసు నమోదైంది. ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగింది. మన పొరుగు రాష్టమ్రైన మహారాష్టల్రోని కొల్హాపూర్‌లో జీ సంస్థ మరాఠీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం గురించి సైతం సంచలన వార్తను మనంవిన్నాం.
సున్నితమైన అంశాల విషయంలో కూడా సంచలనాలు చేయాలనే పోకడ చానళ్ల పోటీ కారణంగా స్థిరపడిందా? అన్ని విషయాలపట్ల ఒకరకంగా చానళ్లు స్పందించడం సబబుకాదు. వ్యాఖ్యలతో వేడిరాజెయ్యాలనీ, రేటింగులు పెంచుకోవడం దేనికి దారి తీస్తుంది? నేడు మన దేశంలో విభిన్న ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య, భాషల మధ్య చాలారకాల అసంతృప్తులుండవచ్చు.
* * * *
మన దేశంలో అనలాగ్ ప్రసారాలు 2013 డిసెంబర్ 31కి ముగిసిపోయి, డిజిటల్ ప్రసారాలపై పూర్తిగా విస్తరిస్తాయని టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకటించింది. నాలుగు మహానగరాల విషయంలో అయితే ఈ గడువు 2011 మార్చి 31. ఈ ప్రక్రియలో ఇది తొలిస్థాయి. రెండవస్థాయిలో 2-11 డిసెంబర్ 31లోపు పదిలక్షలపైచిలుకు నగరాలు వస్తాయి.తర్వాత సంవత్సరంలో అన్ని మున్సిపాల్టీలు వస్తాయి. చివరి దశలో అంటే డిసెంబర్ 31, 2013కు మిగిలిన ప్రాంతాలన్నీ వస్తాయి.
* * * *
ఏది ఆధార రహితమో, ఏది ఆధార సహితమో తెలియకుండా వార్తలు వస్తూ వుంటాయి. ఇది ఒక్క టీవీకే కాదు, పత్రికలకు కూడా చక్కగా వర్తిస్తూ వుంటుంది. ఒక్కోసారి ఇలా వచ్చే వార్తలు కోర్టులోవుండే కేసులను మలుపులు తిప్పడానికో, లేక మరెవరినో దెబ్బ తీయడానికో ఉద్దేశించి వుండవచ్చు. ఆరుషి హత్య కేసుకు సంబంధిచి ఆగస్టు 9న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య మీడియా వైఖరిని పట్టి చూపుతోంది. విశ్వసనీయ కథనాలంటూ చేసే వార్తా కథనాలు ఒక ఆరుషి కేసులోనే కాక, చాలా విషయాల్లో సమస్యలు తెస్తున్నాయని స్పష్టం చేసారు. అయితే ఈ వైఖరి మీడియాకు సమస్య కాగలదని అపుడే మరో వాదన మొదలైంది. 2008లో సూరత్‌సింగ్ అనే న్యాయవాది చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కారణంగా ‘ఆధారంలేని వార్తలు’ విశ్వసనీయ వర్గాల భోగట్టా’ వంటివి చర్చకు వచ్చాయి.
* * * *
టెలివిజన్ చానళ్లకు అవార్డులు ఇవ్వడం పెరిగింది. 2010లోనే యూనిసెఫ్ అవార్డులు, న్యూస్ టెలివిజన్ అవార్డులు, న్యూఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డులు, సిఎంఎస్ అకాడమీ అవార్డులు వంటివి కాక ఇతరాలు కూడా కొన్ని వున్నాయి. అవార్డులు వచ్చాయని ప్రతి చానల్ పలుసార్లు స్క్రోలింగ్ వేసుకుంటున్నాయి. కానీ ఆ సందర్భాల్లో న్యాయ నిపుణులు వై.్భస్కరరావు, పి.సి.రావు వంటి వారు లేదా ఆవుల మంజులత, కె.వి.రమణాచారి, కొల్లి నాగేశ్వర్, ఎన్.్భస్కరరావు వంటివారు చేసిన సహేతుకమైన సూచనలను పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఈనాడు టెలివిజన్ తెలుగుకు, వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలకు చాలా అవార్డులు తీసుకుంటున్నది. కనీసం ఇప్పుడయినా ఇటువంటి కార్యక్రమాల ఫ్రీక్వెన్సీ పెంచాల్సి వుంది. అన్నపూర్ణ కార్యక్రమం నిడివిని టీవీ-5 పెంచాలి. ఏరువాక కార్యక్రమాన్ని ఎన్‌టివి ప్రతిరోజు ప్రసారం చేయాలి. సాక్షి టీవీ పల్లెసీమ కార్యక్రమాన్ని మరలా ప్రారంభించి, వ్యవసాయ అంశాలను పెంచాలి. హెచ్‌ఎంటివి తెలుగు భాషమీద కార్యక్రమం తప్పక ప్రారంభించాల్సి వుంది. మంచి కార్యక్రమాలను గుర్తించి అవార్డులిచ్చే ప్రక్రియ మరిన్ని మంచి కార్యక్రమాలను ప్రేరేపించాలి. అప్పుడే ప్రయోజనం సిద్ధిస్తుంది.

0 comments:

Post a Comment