Relevance of science and religion సైన్స్, మతమూ రెండూ అవసరమే-Andhrajyothy daily 11.02.2011

on Saturday, February 12, 2011

చాలా సందర్భాలలో సైన్స్‌తో మతాన్నీ, దేవుడిని ముడిపెట్టి వ్యాఖ్యానిస్తుంటారు. సైన్స్ చెప్పలేనిది ఆధ్యాత్మికత వివరిస్తుందనీ, దేవుడు సైన్స్‌కు అతీతమని సైతం వివరిస్తూ ఉంటారు. ఐన్‌స్టీన్, శంకరాచార్యులు చెరో దారిన బయలుదేరి అన్వేషిస్తూ చివరకు ఓ చోట (సదరు బాబా పాదాల చెంత) కలిశారని కూడా కొన్నిచోట్ల వినబడుతూ ఉంటుంది. మతం లేని సైన్స్ గుడ్డిది, సైన్స్ లేని మతం కుంటిది అని మహా శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ వ్యాఖ్యానించారని కూడా కొందరు గుర్తు చేయవచ్చు.

వాస్తవానికి మతాన్ని గానీ, దేవుడనే భావనను గానీ వివరించి చెప్ప డం సైన్స్ పనికాదు. దేవుడు ఉన్నాడని గానీ, లేడని గానీ సైన్స్ చెప్పదు. దేవుడు ఆధారంగా ప్రారంభమయ్యే మతం గురించి సైన్స్ చెప్పే అవకా శం అసలు లేదు. మనిషి అనుభవంలోకి వచ్చిన వాటిని వివరించేది సైన్స్. లేదా మనిషి తన పరిధిలో తెలుసుకునే విషయ పరంపరను హేతుబద్ధం గా సైన్స్ వివరిస్తుంది. తెలియని వాటికి ఆదిమానవుడు భయపడేవాడు. రాత్రి ఎందుకు ఏర్పడుతుందో, వర్షం ఎప్పుడు కురుస్తుందో, గ్రహణం ఎలా ఏర్పడుతుందో తెలిసేది కాదు. ఇవి బోధపడనటువంటి కాలంలో ఇటువంటి విషయాలతో ముడిపడి మత సంబంధమైన, పురాణగాథలు అన్ని దేశాల్లో ప్రచారంలో ఉన్నాయి.

ఇక్కడ మరో అంశం గురించి చెప్పుకోవాలి. సైన్స్ రావడంతో చాలా అపోహలు పటాపంచలయ్యాయి. అపోహలతో ఆధారపడి జీవనోపాధి సాధించుకుంటున్న వారికి ఇటువంటివి సహజంగా ఆనందం కలిగించవు. ఫలితంగా వీరు సైన్స్ అవగాహనను వ్యతిరేకించడం కూడా ఉంటుంది. ఉద్రేకపరులు, ఉత్సాహవంతులు ఇరువైపులా ఉంటారు. సైన్స్ రాకతో మతం పలాయనం చిత్తగించిందనే వ్యాఖ్య ఇటువంటి సందర్భాలలోనే వినబడుతూ ఉంటుంది. కేవలం ఇటువంటి సందర్భంలోనే 'సైన్స్-మతం' సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు తారసపడుతూ ఉంటాయి.

ప్రకృతిలోని దృగ్విషయాలను వివరించడంతో సైన్స్ మొదలవుతుంద ని మొదటే చెప్పుకున్నాం. ప్రకృతి అంటే కంటికి కనపడే దాని నుంచి కన్ను చూడలేని దూరం దాకా వ్యాపించిందని మనకు తెలుసు. అలాగే కన్ను చూడలేని దానిని కూడా కొట్టి వేయలేం. ఇక్కడే టెలిస్కోప్ వంటి పరికరా లు మనిషికి దోహదపడతాయి. స్థూల జగత్తును మాక్రో వరల్డ్ అనీ, సూక్ష జగత్తును మైక్రో వరల్డ్ అని పేర్కొంటుంటాం.

సైన్స్-మతం గురించి ప్రస్తావించుకున్నప్పుడు మరో పార్శ్వం ఉంది. దయ, ప్రేమ, సహనం, కారుణ్యం వంటి మానవీయ భావనలను సైన్స్ వివరించజాలదు. ఈ గుణాల అవసరం గురించి మతం చాలా స్పష్టంగా చెబుతూ ఉంటుంది. ఈ గుణాలు మనుషులలో ఎందుకు ఉన్నాయో, లేదా ఎందుకు లేవో లేదా ఎందుకు తగ్గుతున్నాయో-సామాజిక శాస్త్రాలు చెప్పవచ్చు. కానీ విజ్ఞాన శాస్త్రాలు ప్రస్తుతం వివరించే అవకాశం లేదు. సైన్స్ తనకు తెలిసింది వివరిస్తుంది. అంతే! సైన్స్ పరిధిలో లేని దేవుడి గురించి వివరించమనడం అర్ధరహితం.

అందుకే బుద్ధుని వంటి తాత్వికు లు దేవుడు ఉన్నా, లేకపోయినా మనం పట్టించుకోనక్కర లేదు అని భావిస్తారు. కేవలం సాటి మనిషి,అతడి సంక్షేమం ప్రధానమని కూడా బుద్ధుడు బోధించాడు. అంతేకాదు 'శాస్త్రీయ దృక్పథం' అనే దానికి బుద్ధుడు 2500 సంవత్సరాల కిందట చెప్పిన విషయాన్ని నిర్వచనంగా ప్రపంచం అంగీకరించింది.

అదే సమయంలో మత విశ్వాసాలు గల సమాజాన్ని దూషించడం కూడా సైన్స్ పనికాదు. దేవుడు, మతం అనే వాటిని తిరస్కరించడం కూడా తగదని కొందరంటారు. మనంచేసే పనుల గురించి, వాటి ఫలితా ల గురించి ఎక్కువ ఆలోచించడం, ఆశించడం కూడదని చాలా మంది చెబుతూ ఉంటారు. అలా ఎక్కువ ఆశిస్తే, నిరాశ ఎదురయినపుడు తీవ్రం గా క్షోభకు లోనవుతారు. ఇటువంటి సందర్భాలలో బరువు దించుకునే ఉపకరణంగా దేవుడనే భావన దోహదపడాలి.

ఇక్కడ చిన్న ఉదాహరణ ఉంది. అడవిలో కట్టల మోపుతో వస్తున్న మనిషికి సాయం చేయడానికి తోడు ఎవరూ ఉండరు. కానీ ఆ వ్యక్తికి దాహం వేయవచ్చు, లేదా ప్రకృతి కార్యం సంబంధాల అవసరం ఏర్పడవచ్చు. మరి అటువంటి సమయం లో పరిష్కారం ఏమిటి? అందుకే ఆరడుగుల రాతి స్తంభం నాటుతారు అక్కడక్కడ. దానికి రెండు మూడు మెట్లు కూడా ఉంటాయి.

మనిషి ఎత్తు బట్టి ఎక్కడో ఒక చోట నిలబడి ఆ రాతి స్తంభం మీద మోపును జొనిపి పెట్టవచ్చు. పని అయిన తర్వాత, అలాగే ఆ మోపును నెత్తి మీద పెట్టుకోవచ్చు. ఈ ఏర్పాటు 'శుమైతాంగి' అని అంటాడు. చాలా అందంగా కనబడుతుంది ఈ పదం. అడవిలో ఉండే ఈ 'శుమైతాంగి' ఏర్పాటు వంటిది దేవుడనే భావన. మనిషి తనకుండే మానసికమైన బరువును దేవుడి మీద ఉంచవచ్చు. అవసరం లేని వారికి అవసరం లేదు. అడవిలో ఉండే 'శుమైతాంగి'ని అంద రూ వాడాలని లేదు.

కానీ అవసరమైన వారికి ఇది ఎంతో దోహదపడుతుంది. దేవుడనే భావన కూడా అంతే! అదే సమయంలో దేవుడు, మతం భావనల ఆధారంగా అర్థంలేని నమ్మకాలనూ, ఆచారాలను అంగీకరించనవసరం లేదు. వాటిని విడమర చి చెప్పడం అనే పనిని సైన్స్ వాదులు స్వీకరించవచ్చు. ఎందుకంటే సర్వమానవాళి సంక్షేమాన్ని సైన్స్ కోరుకుంటుంది కనుక. సున్నితమైన ఈ తేడాను గమనించకుండా పరుషంగా ఇరువర్గాలు పరస్పరం దూషించుకోవడం అర్ధరహితం. నిజానికి సమాజానికి ఈ రెండింటి అవసరం ఎంతో, ఎలానో తెలుసుకుని అంత వరకే వాడుకునే అప్రమత్తత మనిషికి చాలా అవసరం. అటువంటి ఆలోచనా ధోరణి నేడు ఎంతో ప్రయోజనకరం.
-డాక్టర్ నాగసూరి వేణుగోపాల్

0 comments:

Post a Comment