దృశ్యాన్ని దుర్వినియోగం చేయడం ఇలానా? Andhra bhoomi daily 21 Sep 2010

on Thursday, September 23, 2010

వార్తా చానళ్ళమీద విమర్శలు గమనిస్తే- అవి వార్తా చానళ్ళు అనే ధర్మం కోల్పోయాయి, మిగతా వినోదాత్మక చానళ్ళు ప్రసారం చేసే కార్యక్రమాలు- భక్తి, సినిమా, ఆరోగ్యం, క్రీడలు.. ఇలా ప్రతి సెగ్మెంట్ అంశాలు న్యూస్ చానళ్లలో తప్పనిసరి అయ్యాయి, వార్తా చానళ్ళు మిగతా చానళ్ళను కాపీ కొడుతున్నాయనే అభిప్రాయం ఉంది. అయితే ఈ అనురకరణ అనేది ఒకే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో కూడా సాగుతున్నదని ఇటీవల తెలిసి వచ్చింది. ఉదయం ఫోన్ ఆధారిత జ్యోతిష్య సలహాలు ప్రతి వార్తా చానల్‌లో స్థిరపడిపోయాయి. ఇటువంటి కార్యక్రమాలవల్ల చానళ్ళకు ఆదాయంతోపాటు వీక్షకులు లభిస్తున్నారు.
కొంతకాలం క్రితం జెమిని టీవీ ‘శుభలగ్నం’ అనే జ్యోతిష్య సలహాలు కార్యక్రమం ప్రారంభించింది. ఈటీవీ ‘గ్రహబలం’ వంటి కార్యక్రమం ప్రతి ఆదివారం ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ సెప్టెంబర్ 13 నుంచి ఈటీవీ అటువంటి కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రసారం చేస్తూ ‘శుభమస్తు’ అని నామకరణం చేసింది. దాంతో పాటు ‘జీవనజ్యోతి’ అనే ఆయుర్వేద సంబంధమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. రెండు సినిమా ఆధారిత కార్యక్రమాలను రద్దుచేసి వీటిని ప్రారంభించారు. ఆయుర్వేదం సంబంధించిన ఆరోగ్య కార్యక్రమం జీ తెలుగులో చాలాకాలంగా ప్రసారమవుతూ, ప్రాచుర్యం పొందింది. అలాగే మాటీవీ కూడా!
***
అనుకరణ అనేది చాలా మామూలు అయిపోయింది. ప్రతి వార్తా చానల్ కూడా ‘కార్టూన్’ వంటి కార్యక్రమాలు రెండు మూడు ప్రారంభించింది. దీనిని ‘టీవీ కార్టూన్’ అని కూడా అనవచ్చునేమో! వికటకవి ఒక రకం కాగా, దాదా మరోరకం. సిల్లీబ్రాండ్, మిష్టర్ గిరీశం, గజనీ షో... ఇలాంటి పేర్లతో ఏ చానల్‌కా చానల్ రూపొందిస్తోంది. చానళ్ళు రాజకీయ పరంగా ధ్రువీకరణం చెందడంవల్ల ఇటువంటి సృజనకు మరింత వీలుంది. ఇటువంటి ప్రయత్నాలవల్ల ఉద్దేశిత భావాన్ని బట్వాడా చేయడం సులువు. ఖర్చు కూడా బాగా తక్కువ. వాయిస్ మిమిక్రీతో నడిపించివేయవచ్చు. అయితే ఇటువంటి ప్రయోగాలు కొన్ని వీక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో వీటి నిడివి ఎక్కువగా ఉండటం, మరికొన్ని సమయాల్లో ఒకే కార్యక్రమాన్ని నాలుగైదు రోజులు ప్రసారం చేయడంవల్ల ఎవరికి ప్రమాదమో చానళ్ళు గమనించాలి. అలాగే చౌకబారు స్థాయిలో వ్యాఖ్యలు వీటిల్లో ఉండటం కూడా మంచిదికాదు.
టీవీ-5 చానల్ మొదలైనపుడు ‘పాటనై వస్తున్నా’ అనే కార్యక్రమం ప్రారంభించింది. జనపదాల్లో వినిపించే పాటలకు కేటాయించిన కార్యక్రమం. ఇపుడు మరికొన్ని చానళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించడం మంచిదే! జీ తెలుగు చానల్ వంటల కార్యక్రమాలను విభిన్నంగా రూపొందించి ప్రాచుర్యం పొందింది. దీంతో మిగతా చానళ్ళు అదే దారిలో బడ్డాయి. అలాగే పిల్లల్లో పాటల కార్యక్రమాలను ఇపుడు మరికొన్ని చానళ్ళు మొదలుపెట్టడం గమనార్హం.
వార్తాపత్రికలను ఆధారం చేసుకుని ఉదయం కార్యక్రమం రూపొందించడం మనకు తెల్సిందే. పోటాపోటీగా అన్ని చానళ్ళు ప్రారంభించి ఎక్కువసేపు ప్రసారం చేసేవారు. తర్వాత కొన్ని చానళ్ళు అటువంటి కార్యక్రమాలను ఆపివేయడం కానీ, సమయాన్ని కుదించడం కానీ జరిగింది. ఇటీవల ఆపివేసిన చానళ్ళు మరలా ప్రారంభించాయి. జీ 24 గంటలు, ఐ న్యూస్ మరలా ప్రారంభిస్తే; సాక్షి సమయాన్ని మార్చి మరలా ప్రారంభించింది. హెచ్‌ఎంటీవీ సమయాన్ని తగ్గించి చాలా రోజులయ్యింది. ఇలా ప్రారంభించడం, సమయాన్ని పొడిగించడం, కుదించడం, రద్దుచేయడం అనేవి ఏ అంశాల ఆధారంగా జరుగుతాయో బోధపడదు. ఎటువంటి హేతుబద్ధత లేకుండా గొర్రెదాటు విధానంలో చానళ్ళు మార్పులు చేస్తున్నాయో- అని కూడా భావించాలేమో!
***
టెలివిజన్ మాధ్యమం స్థూలం దృశ్యమాథ్యం. కానీ బుల్లితెరమీద కేకలేస్తూ కార్యక్రమాలు సమర్పించే వారికి ఈ విషయం తెలిసి ఉండదు లేదా తెలుసుకోవడానికి నిరాకరిస్తారో తెలియదు. గొంతును దుర్వినియోగం చేసినట్టే చాలా సందర్భాలలో దృశ్యాలను దుర్వినియోగం చేస్తారు. నెల్లూరు సంఘటనలో నర్తన అనే బాలిక క్రౌర్యానికి గురైంది. ఆమె తల్లిని శాపనార్థాలు పెట్టడం అటుంచి, ఆ బాలిక గాయాలను, పుండ్లను దాదాపు అన్ని చానళ్ళు చాలా విపరీతంగా, అనౌచిత్యంగా, జుగుప్సాకరంగా చూపాయి. ఆ వార్తాంశం ప్రసారం చేసినపుడు ఒకసారి చూపి, వివరాలను న్యూస్‌రీడర్ చదివితే చాలు. ఆ అమ్మాయి మొహం చూపించవచ్చు. అలా కాకుండా పదే పదే చూపడంతో వీక్షకుల మనసులు విపరీతంగా గాయపడతాయి. దౌష్ట్యం గురించి చెప్పడం వేరు, చూపడం వేరు. ఈ తేడాను గమనించిన తెలుగు చానల్ ఒకటైనా ఉందా?
ఇలా చేయడం చాలా నీచమే! తల్లికాదు తాటకి- అనే స్థాయిలో శీర్షికలు పెట్టిన చానళ్ళు కార్యక్రమాలను చేశాయి. మనిషిలోని పాశవిక లేదా ఇంకా అథమమైన గుణాలు ప్రకోపిస్తే ఇలానే జరుగవచ్చు. ఆమెలోని తల్లికన్నా కామిని చాలా రెట్లు బలంగా ఉండి ఉండవచ్చు. అదే సమయంలో చానళ్ళు గాయపడిన నర్తనను పదే పదే క్లోజుప్పులలో వందలు, వేలుసార్లు చూపి వీక్షకులను హింసించాయి.
***
సంగీతాన్ని మేళవించే గుణం చానళ్ళకు తగ్గిపోతోందా! సంగీతం అంటే హైడ్‌లైన్స్ నేపథ్యంగా ఇచ్చే చప్పుడు కాదు. టీవీ-5 ప్రారంభమైనపుడు జిల్లాల నేపథ్యం గురించి ప్రత్యేకంగా పాటలు రాయించి, చిత్రించి ప్రసారం చేశారు. ఆ జిల్లా వార్తలకు దాన్ని విధిగా వాడేవారు. తర్వాత తర్వాత ఆపివేశారు- ఎందుకు? మిగతా అనుకరించలేదని ఆపివేశారేమో తెలియదు. కానీ కాస్త ఓపికగా ప్రసారం చేస్తే- ఆయా ప్రాంతాలలో, ఆయా ప్రాంతాలకు చెందిన వారిలో ఇది తప్పక ఆకట్టుకుంటుంది. మిగతావారికి అది సమాచారం. అంతకుమించి వీక్షకుడికి మంచి రిలీఫ్. అలాగే మహా టీవీ మొదలైనపుడు మంచి పాట రాయించి, పలుసార్లు ప్రసారం చేశారు. మరి ఇపుడేమైందో? ఎందుకు వినిపించదు? కనీసం కొన్ని భాగాలుగానైనా అపుడపుడు వినిపించవచ్చు గదా!

0 comments:

Post a Comment