సైన్స్‌కు, సంఘర్షణకు మధ్య విడదీయరాని బంధం ఉందా? ప్రాకృతి క విషయాలను తరచి చూడకుండా, అంగీకరించి ఉంటే ఇంత స్థాయిలో సైన్స్ ప్రగతి ఉండేదా అనే ప్రశ్న చాలా సబబు. భూమి బల్ల పరుపుగా ఉంది, సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడని పూర్తిగా స్వీకరించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండి ఉండేది. శోధనతో అన్వేషించిన మానవ మస్తిష్కం తెలుసుకున్న వాస్తవం వేరుగా ఉంది. భూమి గుండ్రంగా ఉందనీ; సూర్యుడు ఉదయించడం, అస్తమించడం ఉండదని కేవలం భూగ్రహం తన చుట్టు తాను పరిభ్రమిస్తోందని తర్వాత ఆవిష్కరించబడింది.
ఈ విషయాలు ధ్రవపడటానికి పట్టిన సమయం కన్నా, సమాజం అంగీకరించడానికి ఎక్కువ కాలం పట్టింది. తొలుత, ప్రకృతితో సంఘర్షించి సైన్స్ వాస్తవం వెలికివస్తే తర్వాత దశలో దాన్ని అంగీకరించడానికి సమా జం సంఘర్షించింది. ఎందుకంటే విశ్వాసాలతో ముడిపడిన కథలు, గాథ లు, పాటలు జన జీవితంతో విడదీయలేనివిగా ఉంటాయి.
టాలెమి, కోపర్నికస్, గెలీలియో వంటి గొప్పవారు వాస్తవాన్ని వెల్లడించి తమ జీవితాల ను పణంగా పెట్టారు. కొన్ని శతాబ్దాల తర్వాత మనకు ఈ విషయాలు చాలా సాధరణంగా అనిపించవచ్చు. కానీ వారి జీవితాలు ఎంత సంక్షుభితంగా సాగాయో తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
సైద్ధాంతిక స్థాయిలో సైన్స్ అభివృద్ధి చెందినప్పుడు ఈ రకమైన సంఘర్షన ఎదురుకాగా; సైన్స్ తర్వాతి దశలో ప్రాయోగికంగా అంటే టెక్నాలజీ గా రూపు ధరించిన తర్వాత మరోరకమైన సంఘర్షణను ఎదుర్కొంది. సైన్స్ సూత్రాలతో పనిచేసే టెక్నాలజీ మానవ శ్రమను తగ్గిస్తోంది. మాన వ నైపుణ్యాన్ని పెంచుతోంది అని వివిధ వర్గాలు అర్థం చేసుకున్న పిమ్మట మరోరకమైన పెనుగులాట మొదలైంది. ఏ వర్గాలకైతే అవకాశం ఉందో ఆ వర్గాలు తమకు తగిన బాణిలో ప్రయత్నాలు ప్రారంభించాయి.
విధ్వంసకర ఆయుధాలు అనే టెక్నాలజీ తయారైన నేపథ్యం ఏమిటో ఒక్కసారి పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. మొదటి ప్రపంచయుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం మధ్య కాలంలో శాస్త్రవేత్తలను బంధించి మారణాయుధాలు రూపొందించమని కట్టడి చేశారు. రాజ్యాధికారాన్ని దీనికోసం వినియోగించి ఒత్తిడి చేశారు.
ఆటంబాంబు అనే సమర ఆయుధం పురిటిగడ్డ సంక్షుభిత రాజకీయమే! అలా తయారైన మారణాయుధం ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించగలదో రెండవ ప్రపంచ యుద్ధం సాక్ష్యాధారాలతో రుజువు చేసింది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఈ నూతన మారణాయుధాల ప్రయోగంతోనే రెండవ ప్రపంచయుద్ధం శ్రీకారం చుట్టుకుంది.
రెండు ప్రపంచయుద్ధాల తర్వాత ఏర్పడిన ద్విముఖ ప్రపంచంలో కూడా రాజకీయా లు టెక్నాలజీ ప్రగతిని ప్రభావి తం చేశాయి. సోవియట్ రష్యా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు పోటాపోటీగా చంద్రునిపై శోధనలు, విశ్వంతరాళ పరిశోధనలు ప్రారంభించాయి. దాదాపు మూడు దశబ్దాలకు పైగా ఈపోటీ నడిచింది. సరిగ్గా ఈ దశలోనే టెక్నాలజీ అనేది భయపెట్టడానికీ రక్షణ పొందడానికి ఆధారమైంది. శత్రుదేశం ఇంత స్థాయిలో టెక్నాలజీ సాధించింది అనేది భయహేతువు కాగా; శత్రు దేశానికి సమఉజ్జిగా టెక్నాలజీని పొందామనే భద్రతా భావం కూడా మరోవైపు ఏర్పడింది.
ప్రపంచశాంతి కోసం సాంకేతిక విజ్ఞానం అనే భావన ఈ నేపథ్యంలో ఏర్పడింది. జపాన్‌పై అమెరికా బాంబులు ప్రయోగించిన రోజు హిరోషి మా డేను ఈ సందర్భానికి వేదికగా చేసుకుని ఆ భావనను ప్రచారం చేశా రు. ఈ దశలో అమోఘంగా కృషి చేసిన మహా శాస్త్రవేత్తలున్నారు. నేటికీ ఈరకమైన చర్చ చాలా అవసరం. ఇది ఇరుగుపొరుగు దేశాల మధ్య ఎంత అవసరమో తన లక్ష్యాన్ని స్థిరపరుచుకునే శాస్త్రవేత్తకు అంతకుమించి అవసరం. ఇక్కడే సైన్స్, టెక్నాలజీ ఎవరి కోసం బోధపడుతుంది.
విశ్వం రెండుగా విడిపోయిన తర్వాత పోటాపోటీగా స్పేస్ టెక్నాలజీ వృద్ధి చెందింది. అదే సమయంలో పరిశోధన భూతలం దాటి విశ్వాంతరాళంలోప్రవేశించడంతో పరిశోధన ఖర్చు విపరీతంగా పెరిగిందని గుర్తించా లి. సోవియట్ రష్యా విచ్ఛిన్నం తర్వాత అమెరికా వ్యూహం మార్చుకుంది. దాంతో ప్రపంచ దేశాలు సంయుక్తంగా పరిశోధనలకు దోహదపడడం మొదలైంది. ఇటీవల అంటే ఆగస్టు 26న 'నేచర్' పత్రికలో ఒక నివేదిక మరో విషయాన్ని వెల్లడించింది.
సిఈఆర్ఎన్ అన్వేషణకు సంబంధించి రాబోయే ఐదేళ్లలో బడ్జెట్ కోత ఎంతో చర్చించడానికి 20 దేశాలు సమావేశమవుతున్నాయని ఆ సమాచారం. ప్రస్తుతం యూరప్ దేశాలు సంయుక్తంగా పరిశోధనలు చేయడం ఒక పోకడ. సెర్న్ వంటి దాన్లో యూరప్ దేశాలతో పాటు అమెరికా, ఆసియా దేశాలు కలిసి పనిచేస్తాయి.
శాస్త్ర సాంకేతిక రంగాలలో మెగా రీసెర్చి ప్రాజెక్టులకు ఆర్థికంగా దోహదపడే మూడవ పెద్ద దేశం బ్రిటన్ ఇప్పుడు పొదుపు మంత్రం పఠిస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ దేశాలు వ్యయం చేయడంలో తొలి రెండు స్థానాలు ఆక్రమించాయి. ఈ రెండు ఆర్థికంగా బ్రిటన్ కన్నా మెరుగ్గా ఉండవచ్చునేమో! నేడు కొన్ని మెగా రీసెర్చి ప్రాజెక్టులు ఆర్థికపరమైన సంఘర్షణను ఎదుర్కొంటున్నాయి. ఇలా సైన్స్, టెక్నాలజీ తొలినుంచి ఏదో ఒక రకమైన సంఘర్షణను ఎదుర్కొంటున్నాయి. అయితే నేడు పలు దేశాలు కలిసి ఈ సంఘర్షణలో పాలుపంచుకోవడం మబ్బు తునకకు వెలుగు చారిక!
-నాగసూరి వేణుగోపాల్
భావాల సంఘర్షణతోనే ప్రగతి Andhra jyothy daily 24 th Sep 2010
Posted by Nagasuri on Saturday, September 25, 2010
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment