నిజానికి ఒక విషయం గురించి తెలుగునాట చర్చ అంతగా జరగలేదు. అస్ట్రేలియా లో ఫలానా వ్యక్తి దేశాధినేత అవుతాడని ఆక్టోపస్ పేర్కొంది. దానికి తార్కాణం ఏమిటంటే ఆ ఫలానా వ్యక్తి ఫోటోను గట్టిగా కావలించుకుంది ఆక్టోపస్. ఆయన ప్రత్యర్థి పట్ల కనీసం చూడనైనా చూడలేదు.
ఇలాంటి వార్తలు జూలై నెలలో ప్రపంచ వ్యాప్తంగా పత్రికల్లో, టీవీల్లో గిరికీలు కొట్టాయి. కానీ ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో తేలింది ఏమిటి? ఏ పార్టీకి ఆధిక్యత రాకుండా ఆయోమయ పరిస్థితి ఏర్పడింది. ఆ గందరగోళం ఇంకా తేట పడలేదు. ఎవరు అధ్యక్షులో తేలలేదు. సరే ఇది రాజకీయ పరిస్థితి. ఆయారాం, గయారాంల ఆట ఇంకా కుదుట పడలేని దేశమది. మరి ఆక్టోపస్ జ్యోతిష్యం ఏమిటి? ఎందుకు చెట్టెక్కింది?
వార్తల వెల్లువలో, వ్యాఖ్యానాల సముద్రంలో మునిగిపోకుండా ఒక్క క్షణం ఆలోచిం చి చూస్తే ఈ ఆక్టోపస్ వ్యవహారం ఏమి చెబుతుంది? ఎనిమిది కాళ్ళ జీవి చెప్పడం ఏమి టి? దాన్ని మనం నమ్మడం ఏమిటి? నెదర్లాండ్స్‌పై స్పెయిన్ గెలవడం, జర్మనీ క్రీడా విజయాలు -జూలైలో ప్రపంచ వార్తల్లో పెద్ద విశేషం.
వీటిని పాల్ అనే ఆక్టోపస్ ముందుగా చెప్పిందని ఒకటే హోరు! ఆ సమయంలోనే తెలుగునాట ఛానళ్లలో చిలుక జ్యోస్యాలు కూడా వచ్చి పడ్డాయి. అయితే నేడు ఆక్టోపస్ ఎలా హడావుడిగా సంచలనం సృష్టించిం దో, అంతకు మించిన వేగంతో అదృశ్యమైంది.
ఈ పరిస్థితి చూస్తే ఛార్లెస్ డికెన్స్ నవల 'టేల్ ఆఫ్ టూ సిటీస్' ప్రారంభ వ్యాక్యాలు తప్పక గుర్తుకు వస్తాయి. తెన్నేటి సూరి చేసిన అనువాదం నవల కన్నా మనకే మెరుగ్గా అతికినట్టు అనిపిస్తుంది.
'అది వైభవోజ్వల మహాయుగం-వల్లకాటి అధ్వాన్నశకం; వెల్లి విరిసిన విజ్ఞానం-బ్రహ్మజెముడులా అజ్ఞానం; ఆశాకుసుమాలు కుసుమించే మధుర వసంతం నైరాశ్యపు చలిగుబుళ్లు, ...స్వర్గానికి రాచబాట చేసుకున్నామనుకున్న- మనుష్యులు నడుస్తున్నారు నరకానికి సూటిగా...' సరిగ్గా ఇలాంటి పరిస్థితే ప్రపంచవ్యాప్తంగా తాండవిస్తోందా?
అమేయమైన తెలివిగల ఆధునిక మనిషీ, అటు అణు గర్భాన్ని, జన్యు అంతఃకుహారాన్ని జయించాడని భావించే మనిషీ; మరోవైపు విశ్వాంతరాళాన్ని, అన్య గ్రహాలను శోధించే మనిషీ-కనీస ఇంగితాన్ని సైతం ఆధునికత అనే లాకర్లో పెట్టి ఆక్టోపస్ చెప్పిందని పడుగులిడటం, ప్రపంచవ్యాప్తంగా చర్చించడం ఏమిటి?
ఆక్టోపస్ వ్యవహారం అనేది కేవ లం ఒక మచ్చుతునక మాత్రమే! మన బుద్ధి నైశిత్యాన్ని చూసి ఆక్టోపస్ పగలబడి నవ్వుతోందా అనిపిస్తోం ది. మన సామాజిక శాస్త్రాలు, నైపుణ్యాలు, ఉదారవాదాలు, శాస్త్రీయ దృక్పథాలు లుప్తమై జ్యోతిష్యం అంటూ ఎనిమిదికాళ్ల జీవి వెంట పడటం తమాషా గదూ!
అస్తికత్వం, నాస్తికత్వం-అనే ఆలోచనలతో పోలి స్తే ఆక్టోపస్ వ్యవహారం చాలా దిగువన ఉండిపోతుంది. దేవుడు ఉన్నా డు, లేడు-అని వివాదం చేసే వారిలో కనీసం స్పష్టత ఉంటుంది. కానీ అసలు స్పష్టత లేని గాలి వాటు వ్యవహారాలు ఆక్టోపస్ వంటి అంశాలు!
ఎద్దు ఈనింది అంటే కొట్టంలో కట్టెయ్ అనే మాటలో ఔచిత్యరాహిత్యం పుష్కలంగా ఉందని మనం భావిస్తాం. కానీ ఆక్టోపస్ వ్యవహారాన్ని ఖండించాలని మనం పరిగణిం చం. దీనికి ఖండన కూడా అక్కరలేదని అంటాం కూడా! ఇది పైపెచ్చు వినోదం కలిగించే విషయం కదా అని కూడా చమత్కరిస్తాం.
ఈ తతంగంలో కామన్‌సెన్స్ కొంత ఉన్నది కూడా కొండెక్కుతుందనే భావన మనకు రాదు. ఇందులో మనం వినోదం పెంచుకునే రీతిలో ఉంటే వాదనలో, వ్యాఖ్యలో తేడా ఉంటుంది. చివరకు ఆక్టోపస్‌ను ఆక్టోపస్ మాత్రమే చంపుకుంది. ఆస్ట్రేలియాలోని అనిశ్చిత పరిస్థితి. మనకు జ్ఞాన భిక్ష పెట్టింది. కానీ మన మధ్య ఆక్టోపస్ తతంగాలు చాలా ఉన్నాయి.
ఐటి చదువు చదివి, మంచి ఉద్యోగం చేస్తూ కంప్యూటర్‌తో చేతికి రంగురంగుల దారా లు ధరించే యువకుల ఆలోచన ఏమిటి? మంచి భర్త కావాలని పూజలు చేసే ఆధునిక యువతి-ఒకవైపు చదువు, మరోవైపు ఉద్యోగం గల ఈ యువతి-నిత్యం పూజలు చేయడంలోని ఆంతర్యం ఏమిటి?
గ్రహబలం, రాశిఫలం, జ్యోతిష్యం అంటూ ప్రతి ఉదయం తమ సమయంతో పాటు ఎంతో మందికి కాలహరణం చేసే మీడియా వ్యక్తుల దృక్పథం ఏమిటి? రంగురాళ్లను ధరిస్తే లేదా మరో కవచం ధరిస్తే కష్టాలుపోతాయి, సుఖాలు పరిగెత్తుకువస్తాయని తారలు చెబితే నమ్మే జనం ఇంగితం ఏమిటి?
ఇలాంటి 'ఆక్టోపస్ తంతులు' ఇంకా మనకు చాలానే ఉండవచ్చు. ఇవి ఎనిమిది కాళ్లతో ఏకకాలంలో ఎనిమిది దిక్కుల్లో సాగవచ్చు. ఫలితంగా మనం పైకి కాకుండా ఎంతో కిందకు వెడుతూ వెళ్లవచ్చు. అందుకే నేడు మనకు ఇంటర్‌నెట్, వీకీపీడియా, విజ్ఞాన సర్వస్వాలు అవసరం లేదు. ఇప్పుడు కావాల్సింది పెద్దబాలశిక్ష స్థాయి ఇంగితం మాత్రమేనా?
-నాగసూరి వేణుగోపాల్
Labels: Andhrajyothy, editpage, Nagasuri, Nagasuri Venugopal, Science, science and society, Telugu, Venugopal
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
>>ఇప్పుడు కావాల్సింది పెద్దబాలశిక్ష స్థాయి ఇంగితం మాత్రమేనా?
వార్నీ మీకు ఇంకా ఇది తెలిసినట్టులేదే..
ఇదే పొస్ట్ మోడ్రనిజం, మన చదువులు అన్నీ అటక్కెక్కించి, చక్కగా పెద్ద బాల శిక్ష తెచ్చుకోని (చదివో చదవకూండానో తెలియదు), పూజించాలి, తరువాత నిద్రలో మనకి గ్రహాలు ప్రత్యక్షమవుతాయి, అప్పుడు మనం వాటిని మనకి ఇష్టం వచ్చినట్టు ఆడించి, మన నుదిటి వ్రాతని మనమే వ్రాశుకోవచ్చు.
word verification teeseyagalaru
మీకు, మీ కుటుంబానికి
వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
చాలా బాగా చెప్పారు.
ఎక్కడికి పోతున్నాం మనం?
ఎక్క వలసిన ఎవరెష్లు శిఖరాల పైకా?
దిక్కు మాలిన పాపాల పాతాళ కుహరాల లోకా?
సి.నా.రె. సంధించిన ప్రశ్న అలాగే ఉంది.
మీడియా ప్రదర్శిస్తున్న ద్వంద్వ విలువలు మరీ ప్రమాదకర స్థాయిని చేరాయి.
మంత్ర పూరిత తాయెత్తులు, రంగు రాళ్ళ గురించిన వాణిజ్య ప్రకటనల జోరు విభ్రమాన్ని కలిగిస్తున్నాయి.
మనుగడకు వ్యాపార ప్రకటనలు అవసరమే కాని, మరీ ఇంత బాధ్యతా
రహితంగా విషాన్ని జనబాహుళ్యానికి ఎక్కించే ప్రకటనలకి ( అవి కూడా చాలా సుదీర్ఘమైన ప్రకటనలు) చోటు కల్పించ కుండా స్వయం నియంత్రణ పాటించడం మరీ అంత అసాధ్యమా?
మీ టపా చాలా ప్రశ్నలు సంధిస్తోంది.ఆలోచనాత్మకంగా ఉంది.
Nagasuri గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
హారం
బావుంది. మన తెలుగు ఛానల్స్ మరీ చిలకలని స్టూడియోల్లో పెట్టి ప్రొగ్రాములు చెయ్యడం మరీ ఘోరం..
Post a Comment