శృతి మించకూడదు TV VEEXANAM , Andhra Bhoomi daily

on Friday, September 10, 2010

September 7th, 2010

పది పనె్నండేళ్ల క్రితం రెండే ప్రధానంగా టీవీ చానళ్లు వుండేవి-జెమిని, ఈటీవీ. వాటి మధ్య సిటీకేబుల్. సిటి కేబుల్ దేనితోనూ పడలేక సినిమాల విషయంలో భయంకరంగా వుండేది. ఏ ఇతర చానల్ ఫలానా గంటలకు ఫలానా సినిమా అంటే-దానికి ముందే సిటి కేబుల్ ఆ సినిమాను ప్రసారం చేసేది. అందుకే ఖర్చు, శ్రమలేని పోటీ అయితే అనుక్షణం సంసిద్ధం-అని అనడం. పదమూడేళ్లు గడిచినా, చానళ్ల సంఖ్య నలభైదాకా పెరిగినా-చౌకబారు పోటీ అదేస్థాయిలో లేదా మరింత తీవ్రంగా వుంటోంది. గత ఆదివారం ఒకేసమయంలో రెండు చానళ్లలో ప్రభాస్ నటించిన సినిమా ప్రసారం కావడం దానికి తార్కాణం! ఈ పోటీ కేవలం ప్రభాస్ సినిమాకే కాదని కాస్త పరిశీలిస్తే బోధపడింది. లోకల్ టీవీ టాటాడొకోమా అవార్డుల కార్యక్రమాన్ని ప్రసారం చేస్తే మా టీవీ మరో అవార్డుల కార్యక్రమాన్ని ఇచ్చింది. దీనితోడు తేజా (లేదా జెమిని) చానల్ రెండేళ్ల క్రితం అవార్డుల కార్యక్రమాన్ని మరలా ఇప్పుడు ప్రసారం చేసింది. ఇదెక్కడ దిక్కుమాలిన పోటీనో బోధపడడంలేదు. కేవలం పోటీగా ప్రసారం చేస్తున్నారు కానీ, ఆ కార్యక్రమాలు ఎందుకు ఇప్పుడు ప్రసారం చేయాలో వారు ఆలోచించడంలేదు. ఇలా అనౌచిత్యంగా, హాస్యాస్పదంగా ఇవ్వడంవల్ల చానళ్లకు గౌరవం తగ్గడం తప్ప మరొకటి జరగదు.
టాటా డొకోమా సంస్థ చాలా వితరణంగా చాలా పెద్ద సంఖ్యలో అవార్డులు ప్రకటించింది. టీవీ, పత్రికలు, రేడియో-లా చాలా రంగాలకు పాతిక, యాభైదాకా అవార్డులివ్వడం విశేషం. అయితే ఇక్కడ కూడా తమాషా కనబడుతోంది. ఏ కారణంవల్ల ఒక ఆవార్డు ఇస్తున్నారో, అదే కారణంతో మరో విజేతను విబేధించవచ్చు. కానీ అంత వైవిధ్యంగా, ఎంతో సహిష్టుతతో ఎంపిక చేయడంలో సంస్థల వాణిజ్య లాఘవం కనబడుతోంది. అదే సమయంలో అవార్డులు కూడా ఎలా ప్రస్తుత పోకడలతో మమేకమైపోతున్నాయో కూడా బోధపడుతుంది. అంటే ఒక వ్యవస్థీకృతమైనదిగా తయారవుతోంది. ఈ అవార్డులు ప్రదానోత్సవ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి-వేణు సమర్పించిన హాస్య కార్యక్రమం గొప్పగా వుంది. టీవీ చానళ్లు టీఆర్‌పి వెంపర్లాటను చాలా పచ్చిగా, గట్టిగా బయటపెట్టింది. నిజానికి ఈ ప్రయత్నం ఆద్యంతం నవ్వించడమే కాదు, చానళ్లకు తొడపాయసం పెట్టినట్టు నడిచింది. ఎంత అర్ధరహితంగా, అనౌచిత్యంగా టీవీ పోటీ సాగుతోందో ఇక్కడ వ్యంగ్యంగా బట్టబయలు అయింది. అయినా టీవీ చానళ్లు అదే తరహాలో తమ వెంపర్లాటలో అవిసాగుతున్నాయి. దీనికి చాలా ఉదాహరణలు చూడవచ్చు. అయితే అదే సమయంలో చానళ్ల రాజకీయ ప్రయోజనాలు కూడా ఘనంగానే నడుస్తున్నాయి. ప్రస్తుతం పనె్నండు వార్తా చానళ్లను మూడు సమూహాలుగా పరిశీలించవచ్చు. ఈటీవీ-2, ఎబిఎన్, మహా టీవీ, స్టూడియో-ఎన్ ఒక సమూహం కాగా, ఎన్‌టివీ, టీవీ-5, సాక్షి, ఐన్యూస్ మరో సమూహం. మొదటి సమూహం వార్తలు ఎలావుంటాయో వేరుగా చెప్పనక్కర్లేదు అదేరీతిలో రెండో సమూహం! ఈ వర్గీకరణకు దొరకని చానళ్లు నాలుగున్నాయి. టీవీ-9 తొలి సంచలనాత్మక తెలుగుచానల్‌గా కీర్తిపొందింది. దీనికి గతిశీలత చాలా ఎక్కువ. రాజకీయపరమైన విధానం ఏమిటో ఒక్కోసారి బోధపడదు. ఒక్కసారి చాలా బ్యాలన్స్‌డు అనిపిస్తుంది. తర్వాత మరుక్షణంలో ఇంకోరకంగా వుంటుంది. జెమినీ న్యూస్ మూడవ తెలుగు న్యూస్ చానల్ అయినా సరైన రీతిలో వీక్షకులకు అందుబాటులో లేదు. అందువల్ల జెమినీ న్యూస్ గురించి వ్యాఖ్యానించడం తగదు. ఇక హెచ్‌ఎంటివి, జీ 24 గంటలు కాస్త తెలంగాణ మొగ్గుగల చానళ్లు అని ముద్రపడినవి. అయితే రాజ్ టీవీ రాకతో ఈ గుర్తింపును అది స్పష్టంగా తీసుకుంది. ఇటీవల జీ 24 గంటలు రాజకీయ వాసన తగిలించుకుని సినిమా, అశ్లీలం కలగలిపిన కార్యక్రమాలు బాగా పెంచింది. హెచ్‌ఎంటివి కాస్త విభిన్నంగా, నిలకడగా సాగుతున్న చానల్. దిశ-దశ కార్యక్రమాలతో తెలుగు న్యూస్ చానళ్లను స్టూడియో నుండి బయటకులాగిన ఘనత హెచ్‌ఎం టీవీదే! ఇటీవల ‘్థర్డ్ డిగ్రీ‘ అనే కార్యక్రమం స్టూడియో ఎన్‌లో చూశా. మూడు నాలుగు నిమిషాల ఈ కార్యక్రమానికి స్పూర్తి, ఆధారం సినిమా భావన. ఎమ్‌ఎస్ నారాయణను పోలిన బొమ్మ , గొంతుక ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుంది. ఎంత స్థాయిలో తెలుగుదేశం సానుభూతి వున్నా, ఆ స్థాయిలో ముఖ్యమంత్రిని అగౌరవపరచడం భావ్యం కాదు. చానళ్లకు కనీస స్థాయిలో హుందాతనం వుండాలి. ఎన్‌టివి స్వాతంత్య్రదినోత్సవం రోజున కాస్త అతి చేసిందని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అయితే శృతి మించడం ఎవరికీ మంచిది కాదు!

0 comments:

Post a Comment