Aug 30,2010
ఒక సంచలన వార్త మీకు వినబడగానే అందులోని సత్యాసత్యాలు తెలుసుకోవడానికి ఏ న్యూస్‌ఛానల్ మొదట చూస్తారు?-ఇది దాదాపు సంవత్సరం క్రితం (మనకు న్యూస్ ఛానళ్లు బాగా పెరిగిన సమయంలో) సి.ఇ.ఓ స్థాయిలో వుండే వ్యక్తి నన్ను అడిగిన ప్రశ్న. ఫలానా చానల్ అంటే నాకు గట్టి నమ్మకం, ఆ ఫలానా ఛానలే చూస్తానని నేను చెబుతూ ఒక చానల్ పేరు చెప్పగలనని ఆయన ఉద్దేశ్యం కావచ్చు. నిజానికి పోటీ పెరిగిన ఇటువంటి పరిస్థితి అటువంటి విశ్వసనీయత వుంటే ఏ చానల్ అయినా గర్వపడాలి.ఈ ప్రశ్న అడిగినందుకు ఆయనను అభినందించాలి. చానళ్లు ఆ రీతిలో ఆలోచిస్తే మరీ మంచిది!
గత మంగళవారం రాత్రి దాదాపు పది గంటల సమయంలో ఓ చానల్‌లో బ్రేకింగ్ న్యూస్ అంటూ-కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతంలో పెద్ద శబ్దం, ఎంతో వెలుగు, భయాందోళనల్లో ప్రజలు, అధికారుల అభిప్రాయం-కనబడింది. ఇది రిమోట్ కాలం మరి! మనం ఎంత వేగంగా చానల్ మారుస్తున్నామో, అదేవేగంలో అక్కడ కూడా దాదాపు అదే సమాచారం అన్ని చానళ్లలో కనబడుతోంది. అంతకుమించిన స్పష్టత లేదు. ఒకవేళ వుంటే సంచలనాత్మకతలో స్థాయి భేదం వుండవచ్చు. మనకు ఎన్ని తెలుగు చానళ్లు వున్నాయో, అన్నీ లేదా మా కేబుల్‌లో ఎన్ని తెలుగు చానళ్లు వస్తాయో అన్నీ అదేపంథాలో వున్నాయి.
మరి వీక్షకుల పరిస్థితి ఏమిటి? ఏదో చానళ్ల వ్యవహారంలే! ఏదైనా ఉంటే గింటే ఉదయానికి తెలుస్తుంది కదా అని నిద్రపోక తప్పనిపరిస్థితి తయారైంది. ఆ మధ్య వెంకటాద్రి రైలో, పద్మావతి ఎక్స్‌ప్రెసో-అంటూ కొంతసేపు హడావుడి సాగింది. చీకటిమాటున సాగిన వార్త తెలారేసరికి నల్లబారిపోయిందిసరే, మొదటి ప్రశ్నను చూద్దాం. ఒక్క ఫలానా చానల్‌విశ్వసనీయత గలిగి ఉంది-ఎందుకంటే అది ఫలానా ప్రతిష్టాత్మక సంస్థతి లేదా ఒక ప్రముఖ వ్యక్తి నిర్వహిస్తున్నారు అని భావించే పరిస్థితి పత్రికలకు వుండవచ్చు. అది చానళ్లకు వర్తిస్తుందా? పత్రికా రంగం కొంత వ్యవస్థీకృతంగా, కొంత క్రమశిక్షణతో సాగుతుంది. వార్తా చానళ్లకు సమయంలో పరిమితి లేనట్టే చాలా విషయాల్లో వెసులుబాటు వుంది. కొందరు వ్యక్తులు గొప్పగా ఉన్నంత మాత్రాన ఆ గొప్పతనం 24 గంటలూ వ్యాపించదు. ఎందుకంటే ప్రత్యక్ష ప్రసార కాలమిది. మారుమూల ప్రాంతాని చెందిన వార్త వివరించడానికి ఒక యువకుడికి కెమెరా, మైకు అప్పగించిన సమంలో ఆ వార్తకు ఆయనే సర్వాధికారి. ప్రపంచం గురించి, జర్నలిజం గురించి ఆయనకు ఎటువంటి అవగాహన వుందో, అదే వార్తను రూపుదిద్దుతుంది. ఈ ఫలానా వ్యక్తి స్థాయికి ఆ సంస్థకు సంబంధం వుందా? ఉండాలా? లేకపోతే దాన్ని సాధించే ప్రయత్నాలు సాగుతున్నాయా? అనేది వేరే ప్రశ్నలు.
మొత్తం ప్రసారాలు ఎలా సాగుతున్నాయో పరిశీలించే వ్యవస్థ లేదు. కనీసం ప్రసారమైన తర్వాత దాచుకునే వెసులుబాటు కానీ, తీరిక కానీ చాలా చానళ్లకు ఉండకపోవచ్చు. అలా దొరికింది, ఇలా వడ్డించడమే తప్ప మరో చర్యకు అవకాశం లేకపోవచ్చు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే తక్షణమే తెలియజెప్పి అదే ప్రసారంలో దాన్ని సరిచేసే అవకాశం వుందా? ఆమంచి కృష్ణమోహన్ చానళ్ల యాజమాన్యాల ఘన కార్యాల గురించి కుండబద్దలుకొట్టినట్టు చెప్పిన విషయాలు అలానే ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ఆ సమయంలో సదర చానళ్లు సిఇఓ కూడా సగటు వీక్షకుడిలా ఆ విషయాలు బుల్లితెర ద్వారా తెలుసుకోవడం జరగవచ్చు. అయితే గియితే ఆ వార్త ప్రసారమయ్యాక ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపివేయవచ్చు. అంతకు మించి మరే ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందా?
సిబ్బంది ఉన్నా లేకపోయినా-పోయినా పోటీపడి ప్రత్యక్ష ప్రసారాలు చేయడం బాగానే వుంది. అయితే అంత ఉత్సాహం సిబ్బంది నాణ్యత పెంచడానికి కానీ, లేదా ప్రత్యామ్నాయం కూడా వుండే రీతిలో టెక్నాలజీని సంవృద్ధి పరచడానికి కానీ వుండద. దీనివల్ల ఖర్చు పెరుగుతుందని చానళ్ల అభిప్రాయం కానీ అవివేకం, అజ్ఞానం కలగలిస్తే టెలివిజన్ రేటింగ్ పాయింట్ (టిఆర్‌పి) పెరగడం ఒక అనుభవం. ఫలితంగా ఖర్చు తక్కువ, ఆదరణ ఎక్కువ అనే భావం కూడా స్థిరపడింది. నల్లమల అటవీ ప్రాంతంలో ఏదో విమానం కూలిపోయిందనే రీతలో భయపెట్టిన చానళ్లు మరుసటిరోజు ఉదయం ఆ విషయం గురించి మెదలకుండా వేరే వార్తలు చెబుతూపోయాయి. నిజానికి ఆ ప్రాంతానికి వెళ్లి, చూసి, పరిశీలించే సిబ్బంది ఎన్ని చానళ్లకు వున్నారు. హైదరాబాద్ పొలిమేరలకు వచ్చాక ఎవరి వ్యవహారం వారిది, ఎవరిపోటీ వారిది అనే పోకడ వుంటుంది. కానీ అట్టడుగు స్థాయిలో ఆధారం ఒకేపుకారు కావచ్చుదాన్ని అందుకున్న జర్నలిస్టు కూడా కేవలం ఒక్కరే అయివుండవచ్చు. ఈ స్థాయిలో వార్తా సమాచారాన్ని పంచుకోవడం చాలా సహజం. ఎందుకంటే వారి కారణాలు వారికి ఉంటాయి! అలాగే పక్క చానళ్ల బ్రేకింగ్ చూసి తాము కూడా సాగే అలవాటు చానళ్లకుండవచ్చు!
నిజానికి ఇలాంటి చర్చ చాలామంది చానళ్ల ప్రముఖులకు అసహనం తెప్పిస్తుంది.
ఎప్పుడూ విమర్శలేనా? కొంత మెచ్చుకోలు వద్దా? అని వారడగవచ్చు.
అయితే ఈ చర్చ చేస్తున్నది వీక్షకులకోసం కాదా!
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment