'నెమలికి పించం ఎలాగో/నాగుబాముకు మణి ఎలాగో'- విజ్ఞాన శాస్త్రానికి గణి తం అలా భాసిస్తుంది. ఈ అర్థం వచ్చే శ్లోకాన్ని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ నెల 19న అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల సమ్మేళనంలో పేర్కొన్నారు. మన దేశంలో ఇటువంటి సదస్సు జరగడం ఇదే ప్రథమం. అది కూడా హైదరాబాదులో జరగడం మనకు ఆనందదాయకం.
గణితాన్ని 'క్వీన్ ఆఫ్ సైన్సెస్'గా పిలువడం కద్దు. వాస్తవానికి విజ్ఞాన శాస్త్రం అనేది గణితం ద్వారా పలుకుతుంది. భౌతిక శాస్త్రానికి గణితాత్మక రుజువులు ప్రవేశపెట్టింది గెలీలియో! శ్రీశ్రీకీ, గురజాడకు ఎంత సాహిత్య సంబంధం ఉందో న్యూటన్‌కూ గెలీలియోకు అంతే విజ్ఞాన శాస్త్ర సంబంధం ఉంది.
తర్కం బదులు, గణితం రాక తో విజ్ఞాన శాస్త్రం వ్యక్తీకరణ పెరిగింది. నేడు ఆర్థిక శాస్త్రం, జీవ శాస్త్రం వంటి చాలా రంగాలలో గణితం కీలకమైంది. డిఎన్ఏ, జీనోమ్ వంటి రంగాలలో గణితం సాయపడ కపోతే అడుగు ముందుకు కదలదు.
గణితశాస్త్రం మీదున్న అపోహలు కూడా చాలా ఎక్కువ! లెక్కలు అర్థం కావని చెప్పడం ఒక ఫ్యాషన్. దీనికి తల్లితండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఇతోధికంగా దోహ ద పడుతున్నారు. మూడు దశాబ్దాల క్రిందటి మాట మీతో పంచుకుంటాను. తొమ్మిదో తరగతిలో ఆల్జిబ్రా క్లాసులో చాలా ఒక లెక్కను స్టెప్స్‌ద్వారా సాధించి, ముగించాం. మాస్టారు చెప్పేటప్పుడు ఎటువంటి నోట్స్ లేకుండా బోర్డు మీద రాస్తూ పోతే మేం అందివ్వడం పద్ధతి.
అలా అందించడంలో మా మధ్య పోటీ ఉండేది. ఓసారి అలా సాధించిన తర్వాత నేను టీచరును అడిగాను-ఎందుకింత కష్టపడి దీన్ని పూర్తిచేయడం? దీనివల్ల ఉపయోగం ఏమిటి? అని. ఆయన నా మీద ఇష్టంతో వివరించారు.
కానీ నాకు ఏ మాత్రం సంతృప్తి కల్గించలేదు. ఆయనకు ఆ స్థాయిలో బోధన జరిగి ఉంటే నాకు సం తృప్తికరమైన సమాధానం లభించి వుండేది. అగ్రశ్రేణి ఉపాధ్యాయుల పరిస్థితి మూడు దశాబ్దాల క్రితం ఇలాఉంటే నేడు ఎలా మారి ఉంటుంది?
దీనికి సమాధానం ఏడోతరగతి పాఠ్య పుస్తకం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించింది)లో తర్వాత కొంత కాలానికి చూశాను. ఆ పుస్తకం మున్నుడిలో విశ్వంలో, విశ్వాంతరాళంలో వస్తువులు, ఖగోళ వస్తువుల మధ్య దూరం కనుక్కోవటానికి గణితం తోడ్పడుతుందని పేర్కొన్నారు. దీని కంటే మెరుగైన నిర్వచనం మరోటి ఉండవచ్చు.
కానీ దానిని వివరించేస్థాయిలో ఉపాధ్యాయుడు ఉంటే గణితానికి ఆకర్షణ ఉంటుంది, సౌందర్యం ఉంటుం ది అందుకే డాన్ స్పైల్‌మన్ అనే గణిత శాస్త్రవేత్త తనకు ప్రదానం చేసిన ఒక పురస్కారానికి ధన్యవాదాలు చెబుతూ నాలుగో గ్రేడులో తనకు గణితంలో ఆసక్తి కల్గించిన మాస్టారుకు కృతజ్ఞతలు తెలియచేస్తారు.
తృతీయ ప్రపంచదేశాలలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గణితశాస్త్రం మీద ఆసక్తి తగ్గుతుందనే ఆందోళన ఉంది. పరిశోధనలో ప్రవేశించేవారి సంఖ్య బాగా తగ్గుతుంది. ఒక్క ఖరగ్‌పూర్ ఐఐటిలో థియరిటికల్ మేథమెటిక్స్ వైపు పరిశోధనకు వచ్చే వారు కేవలం ఒక శాతమేనట. మిగతా 99శాతం మంది అప్లయిడ్ మ్యాథ్స్‌వైపు వెడుతున్నారు.
అందుకే ప్రపంచవ్యాప్తంగా గణితం సంక్షోభంలో ఉందని భావిస్తున్నారు. హైదరాబాదు లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మేథమెటీషియన్స్'లో పాల్గొన్న మూడు వేల మంది గణితశాస్త్రవేత్తలు ఇదే విషయమై ఆందోళన చెంది, గణిత శాస్త్ర బోధనను ఎలా ఆసక్తికరంగా మలచాలని లోతుగా చర్చించారు. భావిపరిశోధకులుగా మలచాలని దేశవ్యాప్తంగా 400 మంది పరిశోధక విద్యార్థులను ఆహ్వానించడం విశేషం!
గణితశాస్రం-విజ్ఞాన శాస్త్రాలకు రాణిగా పరిగణించబడినా ఆ శాస్త్రంలో నోబెల్ బహుమతి లేదు. కేవలం రసాయన, భౌతిక, జీవ (వైద్య) శాస్త్రాలు, సాహిత్యంలో మాత్రమే ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ప్రారంభించాడు. ఆర్థిక శాస్త్రాన్ని ఆ తర్వాత కలిపారు. ప్యూర్ మేథమెటిక్స్‌లో సౌందర్యం ఉంటుంది. ఆసక్తి ఉంటుంది.
అయితే తక్షణ ప్రయోజనం పరిశోధకుడికి ఉండకపోవచ్చు! కానీ అప్లయిడ్ మేథమెటిక్స్ వల్ల లాభం ఉంటుంది, కానీ బోరుగా ఉంటుంది. ఇదీ గణిత శాస్త్రం పరిస్థితి. పాఠశాల స్థాయిలో స్పష్టంగా ఉండే గణితంపై స్థాయికి వెళ్ళే కొద్ది క్రమంగా అరూపంగా మారుతుంది.
అందువల్ల పై స్థాయికి వెళ్ళే కొద్దీ బోధన దెబ్బ తింటుంది. అలాగే స్త్రీలు గణితానికి దూరం అనే అభిప్రాయముంది. అదేదో పురుషుల సొత్తు మాత్రమే అయినట్టు. ప్రపంచవ్యాప్తంగా ఉండే ఈ భావనకు సహేతుకమైన ఆధారం ఏదీ లేదు. కానీ ఏదో సాంస్కృతిక పరమైన ఆలోచన కారణంగా ఇటువంటి భావం స్థిరపడింది.
అయితే ఇటీవల కాలంలో స్త్రీలు బాగా రాణిస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్‌లో బాలికలు ఎమ్సెట్‌లో రాణించినంతగా, ఐఐటి ప్రవేశపరీక్షలో నెగ్గుకు రాలేక పోతున్నారు. దీనికి సంబంధించి వినబడే వివరణ ఏమంటే ఐఐటి పరీక్షలో విశ్లేషణా సామర్థ్యం అధికంగా ఉండాలని.
గణితంలో పరిశోధన చాలా చౌక. భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలలో లాగా పెద్ద పెద్ద ఖరీదైన ప్రయోగశాలలు ఇక్కడ అవసరం లేదు. చిన్న కలం, కాగితాలు ఉంటే చాలు. శ్రీనివాస రామానుజం నోటు పుస్తకాలలో నేటికీ బోధ పడని గణిత శాస్త్ర అంశాలు ఉన్నాయి. కానీ ఇంజనీరింగ్ కు ఫిజిక్స్; ఫిజిక్స్‌కు మ్యాథ్స్‌కు పునాది అని మనకు తెలుసు.
ఎమ్ఎస్‌సి రసాయన శాస్త్రం చదవాలంటే బిఎస్‌సిలో భౌతిక శాస్త్రం చదవాలి. ఎమ్ఎస్‌సి భౌతిక శాస్త్రం చదవాలంటే బి ఎస్ సిలో గణిత శాస్త్రం తప్పనిసరి గా చదవాలి. ఇదీ వరుస. కానీ నేడు కంప్యూటర్, ఐటి హడావుడి అధికమై అమ్మలాంటి గణిత శాస్త్రం నిరాదరణకు గురవుతోంది!
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment