విశ్వకవి సైన్స్ వీక్షణం

on Wednesday, October 27, 2010

రవీంద్రనాథ్ ఠాగూర్ సాహితీవేత్తగా, శాంతినికేతన్ నిర్మాతగా, రవీంద్ర సంగీతం రూపకర్తగా మనకు తెలుసు. అయితే రవీంద్రనాథుని సాహిత్య వర్ణ పటంలో శాస్త్ర విజ్ఞానం కూడా ఒక ప్రధాన అంశమని; సాహిత్యాన్ని, సైన్స్‌ను, తత్వశాస్త్రాన్నీ మేళవించి చక్కని గీతాలు, పద్యా లు రాశారని తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విషయాలు తెలుగునాట అంతగా ప్రాచుర్యంలో లేవు. కనుక వాటిని ఒకసారి పరిశీలించడం ఎంతో స్ఫూర్తిదాయకం. అప్పటికి బెంగాల్‌లో ఆచార్య రామేందర్ సుందర్ త్రివేది, అక్షయ్ కుమర్‌దత్తా, ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్, జగదానందరాయ్, ఆచార్య జగదీశ్‌చంద్రబోస్ వంటి వారు పాపులర్ సైన్స్‌ను బెంగాల్‌లో రాస్తున్నారు. కానీ వీరికంటే సుబోధకంగా, జటిలమైన శాస్త్ర అంశాలను జనరంజకంగా రాసి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు గడించడం విశేషం. ఠాగూర్ సైన్స్ ఆసక్తి ఆయన స్వగృహం (జోరాశంకో)లోనే మొదలైం ది. ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్‌ఠాగూర్ ప్రోత్సాహంతో సీతానాథ్‌ఘోష్ ఎన్నో పాపులర్ సైన్స్ వ్యాసాలు రాశాడు. ఈ సీతానాథ్‌ఘోష్‌నే ఠాగూర్ తన స్వీయచరిత్రలు 'జీవన స్మృతి', 'బాల్యం'లలో ఎంతగానో ప్రస్తుతి స్తూ, తనకు స్ఫూర్తి అని పేర్కొంటారు. తన సైన్స్ టీచర్ సీతానాథ్‌ఘోష్ రచనల కారణంగానే విదేశాలలో సాంకేతిక విజ్ఞానంతో ముడిపడిన వ్యవసాయాన్ని అధ్యయనం చేశాడు. శాంతినికేతన్‌లో పట్టుపురుగుల పెంప కం, సిల్కుదారం తయారీ సంబంధించి కృషిచేసి ప్రారంభించాడు ఠాగూర్! ఆరువేల అడుగుల రాగితీగ, బ్యాటరీ సాయంతో సీతానాథ్‌ఘోష్ అప్పట్లో 'మేగ్నటిక్ హీలర్' రూపొందించి కలకత్తాలో సంచలనం కలిగించిన వ్యక్తి. దీని సాయంతో కీళ్లనొప్పులు తొలగించిన ఆయన దగ్గరనే ఠాగూర్ తొలిసైన్స్ పాఠాలు నేర్చుకున్నారు. వడికే యంత్రం, గోధుమల ను దంచే యంత్రం, మరనాగలి, ఇంకు తయారు చేశాడు సీతానాథ్‌ఘోష్. స్వదేశీ పరిజ్ఞానంతో కృషి చేయాలనే భావన ఠాగూర్ మనసులో చిన్ననాటనే పడింది. అందుకే పి.సి.రే 'బెంగాల్ కెమికల్స్'తో ముందుకు వస్తే ఠాగూర్ ఎంతగానో ఆనందపడి అభినందించాడు. అంతేకాదు, గ్రామీణ మహిళలకు కుటీర పరిశ్రమలలో నైపుణ్యం పెంచడానికి శిక్షణాశాలను శాంతినికేతన్‌లో ఏర్పరచాడు ఠాగూర్. ఫ్రెంచి శాస్త్రవేత్త, తత్వవేత్త హెన్రీ బెర్గ్‌సన్-సృష్టి ఎలా ఏర్పడిందనే సిద్ధాంతం తెలుసుకున్నాక ఆస క్తి కలిగి చార్లెస్ డార్విన్, లామార్క్ సిద్ధాంత కృషిని అధ్యయనం చేశా డు ఠాగూర్. మానవ జననం తొలు త ఆఫ్రికాలో మొదలైందని తెలుసుకున్న ఠాగూర్ 'ఆఫ్రికా' అనే పద్యం రాశాడు. అబిసీనియా (ఇథియోపియా) మీద ఇటలీ దాడి చేసినప్పుడు ఈ పద్యం రాశాడు. విశ్వాన్ని పరిచయం చేస్తూ 'విశ్వ పరిచయ' అనే గ్రంథంలో ఠాగూర్ ఖగోళశాస్త్రం, భౌతిక శాస్త్ర అంశాలు రాశారు. ఈ గ్రంథాన్ని మహా శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్‌బోస్‌కు అంకితమివ్వడం విశేషం. ఈ పుస్తకంలో సూత్రాలు, సమీకరణలు కాకుండా సరళంగా రచన సాగింది. విజ్ఞాన సమాచారం చాలా ఉన్న ఆసక్తి కొరవడదు. ఈ రచనకు మూలకారణం తండ్రితో పాటు బాల్యంలో సాగిన ఆకాశదర్శనమే (స్కైవాచ్) అని ఠాగూ ర్ పేర్కొంటాడు. సౌరకాంతిలోని ఏడు రంగులను నృత్యమాడే నెమలి ఫించంలోని ఏడు రంగులతో పోలుస్తాడు ఠాగూర్. రేడియోథార్మిక గామా, బీటా కిరణాలను ఠాగూర్ 'ఆకాశవాణి' అని పునర్ నామకరణం చేశాడు. తర్వాత ఇదే పేరును రేడియోకు ఆయనే వాడాడు. శరీరం లోప లి ఎముకలను గమనించగల ఎక్స్ కిరణాల శక్తిని గమనించి, వాటి ఆవిష్కర్త రాంట్‌జన్‌ను ఎంతగానో ప్రస్తుతిస్తాడు. పరమాణువు అతి చిన్నదని ఠాగూర్ వివరిస్తాడు. ఠాగూర్ రచనలలో హాస్యం కూడా తొణికిసలాడుతుంది. ఎలక్ట్రాన్‌లలోని రుణాత్మకతను స్త్రీత్వంతో, ప్రోటాన్‌లోని ధనాత్మకతను పురషత్వంతో పోల్చాడు ఠాగూర్. రేడియో ధార్మికత గురించి చర్చించినప్పుడు అటువంటి దానితో (భవిష్యత్తులో) శక్తి తయారవుతుందని వివరిస్తాడు. సర్ జేమ్స్‌జీన్స్ సంక్లిష్ట ఆలోచనలను చాలా సరళంగా వివరిస్తాడు ఠాగూర్. సౌరకుటుంబంలో భూభ్రమణం గురించి విశదపరచడానికి బంగాళాదుంపతో వివరిస్తాడు. జగదీశ్‌చంద్రబోస్, ఠాగూర్ మంచి మిత్రులు. బోస్ కోసం ఠాగూర్ 'కర్ణ' అనే పద్యం రాశాడు. జగదీశ్‌చంద్రబోస్ పరిశోధనలంటే ఠాగూర్‌కు చాలా గురి. ఆయన స్ఫూర్తితో శాంతినికేతన్‌లో ఠాగూర్ చెట్లను పెంచే కార్యక్రమం, విత్తనాలు చల్లే కార్యక్రమా లు ప్రారంభించాడు. విశ్వభారతిలో సైన్స్ ఉపాధ్యాయుడు జగదానంద రే ను జనరంజక విజ్ఞాన వ్యాసాలు రాసేలా ప్రోత్సహించాడు ఠాగూర్. సివి రామన్ పరిశోధన చేసిన 'ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్' సంస్థను స్థాపించింది మహేంద్రలాల్ సర్కార్. సర్కార్‌కు మంచి మిత్రుడు ఠాగూర్. సర్కార్ మహాశయుడు హోమియో ప్రాక్టీసును ప్రారంభించడంలో ఠాగూర్ ప్రోత్సాహం ఉందంటారు. సరోజినీనాయు డు కూతురు పద్మజానాయుడు, శాస్త్రవేత్త మహల్నాజాన్ భార్య జబ్బు పడినప్పుడు ఠాగూర్ హోమియో విధానంలో చికిత్స చేశాడని అశోక్‌బాగ్చీ తన పుస్తకంలో వివరిస్తాడు. ఈ సమాచారం పరిశీలిస్తే రవీంద్రుడికి బాల్యం నుంచి సైన్స్ పట్ల, సైన్స్ ప్రయోజనం పట్ల, సైన్స్ సాహిత్యం పట్ల ఆసక్తి, దృక్పథం మెండు గా ఉన్నాయని గమనించవచ్చు. సైన్స్‌ను, ఫిలాసఫిని, సాహిత్యాన్ని రంగరించి సాగడం; సైన్స్ అనువర్తనాలను తన దగ్గరి నుంచే ప్రారంభించడం చాలా ఆసక్తిని కలిగిస్తాయి. నిజానికి ఈ మేళవింపు కారణంగా సాహిత్యానికి ఔచిత్యాన్ని, సైన్స్‌కు లాలిత్యాన్ని సాధించవచ్చు. ఆరోగ్యకరమైన జీవ న పంథా రూపొందుతుంది. విశ్వకవి విజ్ఞాన విశ్వవీక్షణం విస్తృతి మనకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తుంది.- నాగసూరి వేణుగోపాల్

2 comments:

Vinay Datta said...

A very informative post.

Nagasuri said...

Madhri, thank you very much

Post a Comment