టెక్నాలజీకి జై

on Wednesday, October 27, 2010

దాదాపు లక్షన్నరమంది 'తారలు' గ్రూప్-4 పరీక్షలకు అభ్యర్థులుగా ఉండడం అసలు వార్త. సుమారు పన్నెండు లక్షలమంది అభ్యర్థుల లో కొందరు అంటే ఐశ్వర్యరాయ్, నయనతార, శ్రీదేవి, మాధురిదీక్షిత్, సానియామీర్జా, సోనియాగాంధీ, రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, చిరంజీవి వంటి వారి ఫోటోలు కనిపించాయట! తమాషాగా అప్లయి చేసి-పేర్లు, ఫోటోలు ఇలాంటి ప్రముఖులవి తగిలించారట. ఇలా ఎనిమిదోవంతు దాకా వ్యాపించి ఉన్న దరఖాస్తులను వేరు చేయడం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి గగనమైందట. ఆటపట్టించడానికి అప్లయ్ చేసిన వారెవరూ పరీక్ష రుసుము పంపలేదట. కంప్యూటర్ ప్రోగ్రాంలో సమస్య ఉండి,పరీక్ష రుసుం లేకనే అప్లికేషన్ ఆమోదింపబడిందట. మరికొందరు ప్రబుద్ధులు మొక్క లు, చెట్లు, జంతువుల ఫోటోలతో నింపారట. ఈ వ్యవహారం చూస్తే 'పిల్లి కి చెలగాటం' అనే సామెత గుర్తుకురావచ్చు.అలాగే 108 నెంబర్‌కు ఫోన్ చేసే ఆకతాయి కాలర్స్ ఎక్కువైపోయారని సమాచారం. నిజంగా సమస్య లేకపోయినా, ఫోన్ చేసి ఆటపట్టించడం పెరిగిందని తెలుస్తోంది. ఇక్కడ తొలిరకం ఆకతాయిలకూ, రెండవ రకం ఆకతాయిలకు తేడా ఏమీ లేదు. ఆన్‌లైన్‌లో అల్లరి చేసే వారికి కాస్తా సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. అంతే!ఇది ఒక పార్శ్వం కాగా, దీనికి పూర్తిగా భిన్నమైన దృశ్యం ఇంకోటి ఉంది. నెంబర్ 782474317884 ప్రాధాన్యం ఏమిటి? ఇది మన దేశంలో తొలి ఆధార్ గుర్తింపు సంఖ్య. మహారాష్ట్రకు చెందిన గిరిజన మహిళ రంజ న సోనా వాణెకు చెందిన గుర్తింపు సంఖ్య అది. ఆవిడ వేలుముద్రలు, కనుపాప ముద్రలతో సహా నిక్షిప్తమైన బయోమెట్రిక్ ఐడెంటిటి నెంబర్ అది. దీనినే సులువుగా అర్థం కావడానికి 'ఆధార్' అని వ్యవహరిస్తున్నారు. ఇందులో పన్నెండు అంకెలుంటాయి.వీటితో పాటు బహిర్గతం కానీ మరో నాలుగు అంకెలు కూడా ఉంటాయి. ఇది అధికారిక అవసరాల కోసం రహస్యంగా ఉంచబడతాయి. ఈ గుర్తింపు సంఖ్య ప్రాధాన్యం ఏమిటంటే భారతదేశంలో మరే వ్యక్తికీ ఈ సంఖ్య ఉండదు. ఈ సంఖ్య అంటే ఆ ఫలానా వ్యక్తి అని అర్థం. దీనిద్వారా బ్యాంకు అకౌంట్ తెరవడం, గ్యాస్ కనెక్షన్ సాధించడం, రేషన్‌కార్డు పొందడం, ఇంకా పాన్‌కార్డు, ఫోన్ కనెక్షన్, పాస్‌పోర్టు వంటివి కూడా పొందడానికి వీలవుతుంది. ఈ జాబితాలో మరికొన్ని వచ్చి చేరే అవకాశం ఉంది.అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ప్రధా ని మన్మోహన్ 'ప్రపంచంలో మరెక్కడా ఇంత భారీ స్థాయిలో సాంకెతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడం లేదని' పేర్కొంటూ త్వరలో ప్రతి భారతీయుడు 'ఆధార్' సంఖ్య పొందే వీలుందని విశదం చేశారు. ఇది తక్కువ ఖర్చుతో, జాతీయస్థాయిలో ఉపయోగపడే, తర్వగా పరీక్షించే వీలున్న గుర్తింపు సంఖ్య ఆధార్.ఆధార్ గుర్తింపు సంఖ్య సెప్టెంబర్ 30న శ్రీకారం చుట్టుకుంది. దీనికి ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు అవుతోందని ఒక అంచనా. సుమారు ఐదేళ్ల వ్యవధిలో దేశంలోని ప్రజలంద రూ ఈ గుర్తింపు సంఖ్యను పొందగలరని మరో గణింపు. దీని ద్వారా ప్రభు త్వ పథకాల సద్వినియోగం కాగలవని ఆశ. ఎన్నికల మోసాలు అరికట్టటడంతోపాటు ఉగ్రవాదం వంటి సమస్యను అంతమొందించడానికి ఈ 'ఆధార్' వ్యవస్థ దోహదపడుతోందని భావిస్తున్నారు. ఈ వివరాలు పరిశీలిస్తే ఇదంతా సాధ్యమా? అని కూడా అనిపించవచ్చు.సెప్టెంబర్ 30 దరిదాపుల్లో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఈ 12 అంకెల సంఖ్యను మరింత వినియోగించుకోవచ్చునని తెలుపుతున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీన అయోధ్యకు సంబంధించి తీర్పు వెలువడింది. ఆ సందర్భంగా మొబైల్ ఫోన్లలో బల్క్ మెసేజ్‌లను నిషేధించారు. చాలా మంది మొబైల్ ఫోన్ నెంబర్లకు సంబంధించిన ఆధార పత్రాలు పంపమనే ప్రక్రియ మొదలైంది. రిజిస్ట్రేషన్‌లో గందరగోళం ఉంటే సరిదిద్దుతారు. అంతేకాదు త్వరలో ఫోన్‌నెంబర్లు ఇక నుంచి 12 అంకెలు కలిగి ఉంటాయి. జనాభా వందకోట్లు దాటిపోయినప్పడు పది అంకెల మొబైల్‌నెంబర్ సరిపోదు. ఇంకా వివరంగా చెప్పాలంటే 117 కోట్ల జనాభా ఉండగా 65.242 కోట్ల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయని అంటున్నారు. ఇది గత జూలై మాసపు లెక్కింపు అట. కాకతాళీయంగా సెప్టెంబర్ 28న మరో ప్రకటన వెలువడింది. బ్యాంకు బ్రాంచీలు, ఎటిఎం సేవలు అందని మారుమూల ప్రాంతాలకు సేవలు తప్పక అందాలని రిజర్వ్‌బాంక్ మార్గ నిర్దేశాలను గత మంగళవారం విడుదల చేసింది. ఇందులో భాగంగా బిజినెస్ కరస్పాండెం ట్లు నియమించబడతారు. డబ్బులు జమ చేయడం, వెనక్కి తీసుకోవడం వంటి పనులను ఈ కరస్పాండెంట్లు చేస్తారు. దీనికి మొబైల్ ఫోన్ నెంబర్ల ద్వారా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించడం దోహదపడుతుంది.ఒక వారంలో సంబంధించిన మూడు సంఘటనలకు ఈ పన్నెండు అంకెల సంఖ్య మంచి పరిష్కారం కాగలదని 'టెక్నాలజీ విజనరీస్' భావిస్తున్నారు. యూనిక్ ఐడెంటిటి నెంబర్ ఒకవైపు మొబైల్ ఫోన్ నెంబర్‌గా, మరోవైపు మొబైల్ బ్యాంకింగ్ నెంబర్‌గాకూడా ఉపయోగపడుతుందని వీరి ప్రతిపాదన. వివరాలు పరిశీలిస్తే ఇది సాధ్యమా అని ఆశ్చర్యం కలగవచ్చు.అదే సమయంలో గత మూడు దశబ్దాలలో సంభవించిన కంప్యూట ర్ విప్లవాలు పరికిస్తే ఇవన్నీ సాధ్యం కావచ్చు అనే నమ్మకం కూడా కలుగుతుంది. అరకొర పొరపాట్లు, అజాగ్రత్తలు, కొన్ని మోసాలు కూడా ఎదురుకావచ్చు. వాటికి వ్యవస్థలో స్వాభావికంగా ఉండే నిర్లిప్తత ఆజ్యం పోయవచ్చు. అయినా పట్టు సడలవలసిన పని లేదు. అటువంటి దుశ్చర్యలకు కళ్ళెం వేయాల్సిందే!మన సమాజం వైవిధ్యంగా ఉన్నప్పుడు ప్రయత్నా లు, ప్రయోగాలు విభిన్నంగానే ఉంటాయి. అందుకే ఐశ్వర్యరాయ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్-4 పరీక్ష రాసే అభ్యర్థిగా ఆవిడ ప్రమేయం లేకుండా మారిపోయింది. కొసమెరుపు లాంటి తాజాకలం ఏమిటంటే రైతులకు ఎస్ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందిస్తారట. ఈ మంగళవారం ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

0 comments:

Post a Comment