మన జీవితం, మన భవిష్యత్తూ..! andhra jyothy 28-1-11

on Friday, January 28, 2011

గణితాన్ని విజ్ఞాన శాస్త్రాలలో మహారాణిగా పరిగణిస్తారు. నిజానికి గణితం అనేది సైన్స్‌కు పరిభాష. గణితాత్మకంగానే సైన్స్ అవగాహన సాగుతుంది. అలాగే భౌతికశాస్త్రం విశ్వం గురంచీ, దాన్ని నడిపే శక్తి గురించీ వివరిస్తుంది. అణువు నుంచి అంతరిక్షం దాకా భౌతికశాస్త్ర పరిధిలోకి వస్తాయి. అయితే పదార్థం అంతర్గత నిర్మాణం, చర్యల గురించి వివరించేది రసాయన శాస్త్రం.

ఆహారం, ఔషధాలు, ఇంధనం... ఇలా చాలా విషయాలను రసాయన శాస్త్రమే చెప్పాలి. మరో రకంగా చూస్తే తయారు చేయబడే అన్ని పదార్థాలు, సంగ్రహించబడే అన్ని పదార్థాల గురించి రసాయన శాస్త్రం వివరిస్తుంది. అందుకే రసాయన శాస్త్రాన్ని 'సెంట్రల్ సైన్స్' అని అంటారు. ఇక్కడ సెంట్రల్ అనే దాన్ని 'కీలకం' అని మనం అనువదించుకుంటేనే పూర్తి అర్థం బోధపడుతుంది. గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు ఎన్ని విషయాలు చెప్పినా, ఈ ప్రపంచం, జీవులు ఎందుకు కదులుతాయో అందుకే తొలి మూడింటిని భౌతిక శాస్త్రాలు అని పరిశీలిస్తే, మిగతా వాటిని జీవ శాస్త్రాలు అని అంటారు.

అసలు ఈ విషయాలు చెప్పుకోవడానికి సందర్భం ఉంది కనుకనే, ఈ ముచ్చట్లు! 1911లో మేడమ్ క్యూరీకి నోబెల్ బహుమతి రసాయన శాస్త్ర విభాగంలో లభించింది. అది ఆమెకు రెండవసారి! నిజానికి క్యూరి అంటే బహువచనం-పియరీ క్యూరి, మేరి క్యూరి దంపతులు. మేరి- పియరి క్యూరి విద్యార్థిని. వారు ప్రేమించుకుని 1860లో వివా హం చేసుకున్నారు. రేడియో ధార్మికత గురించి వీరిరువురు పరిశోధిం చి థోరియం రేడియో ధార్మిక మూలకంగా కనుగొన్నారు. తర్వాత 1898లో వారు పొలోనియం, రేడియం అనే మూలకాలను కనుగొన్నారు.

ఈ కృషికి వారు 1902లో నోబెల్ బహుమతిని కలిసి అందుకున్నారు. అయితే 1906లో పియరి క్యూరి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రేడియో ధార్మిక పరిశోధనల కారణంగానే మేరికి క్యాన్సర్ వచ్చిందని భావన. మేరి కుమార్తె ఐరిన్, మేరి సహాయకుడు ఫ్రెడిరిక్ జూలియట్ ను వివాహమాడింది. వారిరువురు 1935లో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. వీరు కూడా రెండు సంవత్సరాల వ్యవధి లో (1956, 1958 లలో) క్యాన్సర్‌తో మరణించారు. మూడు నోబెల్ బహుమతులు సాధించిన నలుగురి కుటుంబం ఇది.

నిజానికి మేరి క్యూరి జీవితం గమనిస్తే ఒక జానపద కథలాగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతులేని స్ఫూర్తిని మిగుల్చుతుంది. రసాయ న శాస్త్రం ప్రాధాన్యం పట్ల, అవసరం పట్ల అవగాహన తగ్గుతున్న సమయంలో మేరి క్యూరి సైన్స్ త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ 2011 సంవత్సరంను 'అంతర్జాతీయ రసాయన శాస్త్ర సంవత్సరం'గా గుర్తించారు. మేరీక్యూరి విజయానికి శత వార్షికమని స్ఫురిస్తూ ఈ అంతర్జాతీయ సంవత్సరం ప్రకటించబడింది. రసాయన శాస్త్రం విజయాలను ప్రస్తుతిస్తూ, మానవ జాతికి అది చేసిన మహత్కార్యాలను గుర్తుచేస్తూ 2011 సంవత్సరం కార్యక్రమాలు సాగాలని 'అంతర్జాతీయ రసాయన శాస్త్ర సంవత్సరం' నిర్ణయించింది.

మనకు తెలిసిన జగత్తు అంతా ఘన, ద్రవ, వాయు రూపంలోనే ఉంటుంది. రసాయన శాస్త్ర అపరమైన అవగాహన బట్టే మనకీ ప్రపం చం బోధపడుతుంది. నిజానికి అన్ని జీవ వ్యాపారాలూ (క్రియలు) రసాయన చర్యల ద్వారానే నియంత్రించబడతాయి. అయితే అన్ని శాస్త్ర విభాగాల లాగానే రసాయన శాస్త్రాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది ఇలానే కొనసాగితే రసాయన శాస్త్ర పురోగతి మాత్రమే కాకుండా, మానవ కోటి భవిష్యత్తు కూడా గాయపడుతుంది. విజ్ఞాన శాస్త్రాలలో కీలక స్థానాన్ని ఆక్రమించిన రసాయన శాస్త్రం విజ్ఞానపు పార్శ్వాన్ని, కళాత్మక కోణాన్ని మరింత విపులంగా గుర్తుచేయాలని రసాయన శాస్త్రజ్ఞుల ప్రపంచం తహతహలాడుతోంది.

ముఖ్యంగా బాల బాలికలలో రసాయన శాస్త్రం పట్ల ఆసక్తి కలిగించాలని ప్రధానం గా భావిస్తున్నారు. కెమిస్ట్రి క్లాసంటే బోరు అని ఎంతో మంది బాలబాలికలు భావించడానికి కారణం ఎవరో తెలుసా? అలా బోధించే మన ఉపాధ్యాయులూ, మన బోధనా విధానాలూ! ఇది భవదీయుడి అభిప్రాయం కాదు. డాక్టర్ పి.ఎస్.ఎన్. రావు వంటి ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడి ఆలోచనా సరళి. దీని గురించి కూడా ప్రస్తుతం మనం దృష్టి పెట్టాలి. ఇక్కడ విజయం సాధిస్తే, మరింత గొప్ప పరిశోధనకు ద్వారాలు తెరుచుకొంటాయి.

వాస్తవానికి మారిన విజ్ఞాన పరిస్థితుల్లో రసాయన శాస్త్రం పరిధి అంతులేనిది. జీవశాస్త్రపు లోతులు చూడటానికి రసాయన శాస్త్రం ఒక దివిటీలాగా దోహదపడుతుంది. ఆరోగ్యం, రోగం గురించి బోధపడాలంటే జన్యు స్థాయిలో రసాయన ప్రక్రియలు అవగతం కావాల్సి ఉంది. 2009 సంవత్సరం రసాయన శాస్త్రపు నోబెల్ బహుమతి భారతీయ సంతతికి చెందిన వెంకట్రామన్ రామకృష్ణన్‌కు వచ్చింది. ఇదే కాదు, ఇటీవల నోబెల్ బహుమతులన్ని,జీవవ్యవస్థల రసాయన ధర్మా లు వివరించడానికే కేటాయించబడ్డాయి. ఆరోగ్యం, పర్యావరణం వం టి వాటికి సంబంధించి పూర్తి సమాచారం కావాలంటే రసాయన శాస్త్రం ఎంతో అవసరం. ఈ రెండు అంశాలు ఆరోగ్యం, పర్యావరణం అనేవి మనగల అభివృద్ధిని సాధించే విద్యకు చాలా కీలకం. అటువంటి విద్యా సాధనకు ఐక్యరాజ్య సమితి ఒక దశాబ్దాన్ని ప్రకటించింది.

అందుకే రసాయన శాస్త్రాన్ని ఇష్టపడుదాం, అర్థం చేసుకుందాం, మరింత మంచి పరిశోధన చేద్దాం, మరింత అర్థవంతమైన, భద్రత గల భవిష్యత్తును రూపొందించుకుందాం. ఈ దిశలోనే 2011లో వివి ధ విజ్ఞాన శాస్త్ర సంబంధమైన కార్యక్రమాలు రూపుదిద్దుకోవాలి. ఎందుకంటే రసాయన శాస్త్రం అనేది మన జీవితమూ, మన భవిష్యత్తూ కనుక!

-

0 comments:

Post a Comment