సైన్స్ ఉద్యమానికి సవాళ్లు - 17th Dec,2010

on Wednesday, January 19, 2011

సైన్స్ అంటే సత్యపథం, ఆశావాదం, కపటం లేని విధానం! ఈ విషయాలు పేర్కొనడానికి కారణాలున్నాయి. సైన్స్ ఆధారంగా ఏర్పడిన సంస్థలు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. సైన్స్ ద్వారా ఆరోగ్యం, ఆహారం, ఆయుష్షు సాధ్యం కావాలని శ్రమిస్తున్నాయి. అర్ధరహితమైన నమ్మకాలు, దోపిడీ సాగకూడదని భావిస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా పాతుకునిపోయిన మూఢనమ్మకాలు ఇంకా విస్తరిస్తున్నాయి. కానీ తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి టెక్నాలజీ సైతం దోహదపడవచ్చు. అసంగతమైన నమ్మకాలకు పురిగొల్పే టీవీ సీరియళ్లు, కార్యక్రమాలు విరివిగా ప్రసారం కావడంలో టెలివిజన్ అనే టెక్నాలజీ పాత్ర చాలా ఉంది. దీనికి మించి కొత్త రకం సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి స్వరూపం గుర్తించే క్రమంలో బోల్తాపడకూడదు.

ఇటీవల హైదరాబాద్ నగరంలో ఒక సదస్సు జరిగింది. దీని సారాం శం ఏమిటంటే మొబైల్ ఫోన్ల వాడకంతో సమస్యలు లేవనీ, అది కేవలం అర్ధరహిత ప్రచారమని. ఆ మేరకు మరుసటి రోజు పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ సదస్సును మొబైల్ కంపెనీలు ఖర్చుతో నిర్వహించారు. అందువల్ల ఏ గూటి చిలుక ఆ గూటి పలుకే వల్లిస్తుంది. ఈ వార్త ప్రచురింపబడిన రోజునే ఆరోగ్య కార్యక్రమంలో మొబైల్‌ఫోన్‌తో అనర్థాలు చాలా ఉన్నాయని టీవీ చానల్ ప్రసారం చేసింది. నిజానికి ఈ పరిస్థితిని కూల్‌డ్రింకులలో రసాయనాల అంశంతో పోల్చవచ్చు. శీతల పానీయాలలో రసాయనాలున్నాయని సహేతుకంగా రుజువైనా, ప్రచారం పుణ్యమా అని చాలామంది దాన్ని పూర్తిగా నమ్మడం లేదు. ఈ స్థాయిలో శీతలపానీయాల సంస్థలు ప్రచారాన్ని సాగిస్తున్నాయి.

శీతలపానీయాల లోగుట్టును వెలికి తీయడానికి స్వచ్ఛంద సంస్థలూ, సైన్స్ సంస్థలూ చాలా పాటుపడ్డాయి. కొంత విజయం సాధించాయి కూడా! తర్వాత సైన్స్ సంస్థలు ఈ విషయం పట్ల కాస్త వెనుకంజవేయ డం, దాంతో శీతల పానీయాల సంస్థలు ప్రచారాన్ని ఉధృతం చేయడం జరిగింది. అయితే మొబైల్‌ఫోన్ల వాడకం గురించి పెద్దఎత్తున అవగాహ నా కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంది. అంటే టెక్నాలజీ ముసుగున మన ఆరోగ్యం, ఉనికి మొదలైన వాటిని దెబ్బతీసే వాటిని గమనించడం సైన్స్ ఉద్యమశీలుర తక్షణ కర్తవ్యం. మొబైల్ బెడద కేవలం ఒకటి మాత్రమే కావచ్చు.

మరింత పరిశీలన చేస్తే మరిన్ని సమస్యలున్నాయని బోధపడవచ్చు. ఇటీవల కాలంలో గ్రహణం, శాంభవి, మరేదో మూఢనమ్మకం.. ఇలా ఏది సంభవించినా టీవీ చానళ్లలో అరగంటకు తక్కువ కాకుండా చర్చలు ప్రసారం అవుతున్నాయి. ఇందు లో ఉదయం పూట జ్యోతిష్యం చెప్పే పండితులు ఒక వాదనకు నేతృత్వం వహిస్తుండగా; సైన్స్ సంస్థల వ్యక్తులు వారితో విభేదిం చే చర్చలో పాల్గొంటారు. అనుసంధానంగా ఉండే సమన్వయకర్త మాటలకు ఆజ్యం పోస్తూ, మంటలు ఎగిసే చర్చ జరపాలని ప్రయత్నిస్తారు.

ఎటువంటి వెలు గు లేకుండా కేవలం వేడి జిమ్ము తూ చర్చ ముగుస్తుంది. ఇరు వర్గాల తీవ్ర స్వరాలు గుర్తుంటా యి. కానీ చర్చ చివరకు ఏమి చెప్పిందో గుర్తుకురాదు. శృతిమించిన వాదనలు పెరిగి కొందరిని టీవీ కట్టేసేట్టు చేయవచ్చు. ఈ సందర్భంగా ఒక కీలకమైన విషయం గల్లంతు కావడాన్ని ఎక్కువమంది గుర్తించలేకపోతున్నారు. ఇటువంటి చర్చల వల్ల సైన్స్ సంస్థలకు కొంత ప్రచారం లభించవచ్చు. ఎక్కువ ఖర్చు, శ్రమ లేకుండా సాధ్యపడిన విషయం కూడా కావచ్చు. కానీ వీక్షకుల దృష్టిలో ఇలా విభేదించే వారిగా, గొడవపడే వారిగా సైన్స్ సంస్థల వ్యక్తులు గుర్తుండిపోవచ్చు.

కానీ సైన్స్ అంటే వీలయినంత ఎక్కువమంది దోహదపడే గొప్ప సాధనమని చెప్పలేకపోతున్నారని గమనించాలి. నిజానికి జ్యోతిష్యం, వాస్తు.. వంటివి ఉపాధి కల్పించే మార్గాలు. కానీ సైన్స్ ప్రచారం వంటివి హాబీగా సాగే పనులు. అందువల్ల మొదటి వర్గంవారు మరింత సంఘటితంగా, వ్యూహాత్మకంగా, లాఘవంగా సాగుతా రు. వారే ప్రచార మాధ్యమాలకు ప్రకటనలు కూడా ఇస్తారని గమనించా లి. కనుక ప్రసార మాధ్యమాలు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా సాగుతా యి. దీనితో సైన్స్ అసలు ప్రయోజనం కనబడకుండాపోతోంది. కానీ కొంత ప్రచారం మాత్రం మిగులుతుంది. సైన్స్‌లేని ప్రచారంతో ప్రయోజనం ఏమిటో ఆలోచించాలి.

మరోవైపు విలువైన రాళ్లు, శని యంత్రాలు, హనుమాన్ కవచాలు విశృంఖలంగా ప్రచారం పొందుతున్నాయి. ఇంకోవైపు అర్ధరహితమైన కథనాలు సైన్స్ కథనాలుగా రక్తికడుతున్నాయి. అంతకు మించి సైకాలజి, సైన్స్, ఆరోగ్యం అటూ అర్ధరాత్రికి ముందు విచిత్రమైన కార్యక్రమాలు ప్రసారమవుతుంటాయి. ఈ తరహా అంశాల వల్ల ఏమి ప్రయోజనం ఉందో ఆలోచించాలి.

వీటిని విసర్జించాలని పోరాడేవారు ఎవరు? సైన్స్ సంస్థలకు ప్రచారం కల్పిస్తున్నారని ఇటువంటి పోకడలను ఉపేక్షించడం తగునా? అందుకే సైన్స్ ఉద్యమ సంస్థలను ఆలోచించమని కోరడం! ఎన్ని ప్రసార మాధ్యమాలు వచ్చినా, రాయడం అనేది చాలా మౌలికమైన అంశం. అది లేకుండా ఇతర మాధ్యమ రూపాలను మనం ఊహించ లేం. కానీ సైన్స్ రచయితలు ఎందరున్నారని ఎవరైనా అడిగితే చేతి వేళ్ల సంఖ్యను మించిన సంఖ్య రాకపోవడం నేటి విషాదం.

నలభై సంవత్సరాలలోపు సైన్స్ రచయితలు ఎవరైనా ఉన్నారా- అని ఎంతో మందికి సందే హం రావచ్చు. దీన్ని మరింత ముదరనిస్తే ముందు ముందు మరింత ప్రమాదం ముంచుకు రావచ్చు. కనుక సైన్స్ ఉద్యమ సంస్థలు నేడు పూర్తిగా దృష్టిపెట్టి, తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. లేకపోతే వాణిజ్య ఎత్తుగడలతో పోరాడుతూ, క్రమంగా ఆ వాణిజ్యానికే పావుగా మారిపోయే పరిస్థితి ఎదురుకావచ్చు!
-డా. నాగసూరి వేణుగోపాల్

0 comments:

Post a Comment