సంగీతానికి టెక్నాలజీ దోహదం -3rd Dec,2010

on Wednesday, January 19, 2011

మినీ ప్రపంచంగా మొబైల్ పుట్టుకురావడం మరో ప్రభంజనం. చాలా ఫలితాలను అరచేతిలో అలవోకగా సాధించ గలగడం ఇందులోని మర్మం. సంగీతానికి సంబంధించి టెక్నాలజీ సౌలభ్యాన్ని, ప్రచారాన్ని, ప్రభావాన్ని విశేష రీతిలో సాధించగలిగింది.

సెన్స్, టెక్నాలజీ కారణంగా కలిగే ప్రయోజనాల గురించీ, అలాగే మరోవిధంగా వాడితే కలిగే వినాశనం గురించీ చెప్పడానికి- కత్తితో పోల్చడం చాలా కాలంగా ఉంది. కత్తిని రెండు రకాలుగా వినియోగిస్తాం అని చెప్పడం ఉద్దేశ్యం. కానీ, ప్రయోజనాల గురించి చాలా సందర్భాలలో చెప్పకోవాల్సినంతగా మనం ఘనంగా చెప్పుకోవడం లేదేమో! ఒక సంగీతం విషయం తీసుకుంటే టెక్నాలజీ చేసిన దోహదం ఎంతో విస్మయాన్ని కలిగిస్తుంది.

తొలి దశలో సైన్స్ అనేది సంగీతం తీరుతెన్నులు తెలుసుకోవడానికి తోడ్పడితే, తర్వాతి దశలో టెక్నాలజీ సంగీతానికి శాశ్వతత్వాన్ని, విశేషమైన ప్రాచుర్యాన్ని కలిగించింది. టెక్నాలజీ సౌలభ్యాలు లేకపోతే గాయనీ గాయకులు ఇంత హాయిగా ప్రావీణ్యం చూసి ఉండేవారు కాదు. ప్రకృతిని అర్థం చేసుకోవడంతో సైన్స్ మొదలై, అనుకరించడంలో వర్ధిల్లుతోంది. మనిషి గళం నుంచి వాయిద్యాల సంగీత ధ్వనులు అర్థం చేసుకోవడానికి శబ్దానికి చెందిన విజ్ఞాన శాస్త్రం గొప్పగా సహకరించింది. అలా సహకరిస్తూ తాను ఎంతో వృద్ధి చెందింది కూడా! హైస్కూలు, ఇంటర్మీడియట్ స్థాయిలో సంగీత వాయిద్యాలు ఎలా పనిచేస్తాయో అని వివరించే అంశాలు పరిశీలిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఘంటసాల సాంస్కృతిక చైతన్య వేదిక ఇటీవల విజయవాడలో ఒకరోజు పాటు కార్యక్రమం నిర్వహించింది. అందులో టెక్నాలజీ ప్రభావం గురించి వివరించమని ఆహ్వానించినపుడు-ఈ విషయం గురించి మళ్లీ దృష్టిపెట్టాను. గ్రామఫోన్ రికార్డు ద్వారా ధ్వని ముద్రణ మొదలైంది. అదే తర్వాత టేపుగా మారింది. టేపుతో సౌలభ్యం ఉన్నా నాణ్యత మాత్రం గ్రామఫోన్‌దే. తర్వాత వచ్చిన కాంపాక్ట్ డిస్క్ నాణ్యతలో మాత్రం టేపు ను మించిపోయింది.

మరింత చిన్నదిగా మారి, విస్తారమైన సంగీతాన్ని దాచుకోగలిగింది. రేడియో రావడంతో గ్రామఫోన్‌కు రెక్కల గుర్రం లభించినట్టయింది. తర్వాత వచ్చిన క్యాసెట్ రికార్డర్ మరింత విరివిగా సంగీతం లభించేలా సమాజానికి దోహదపడింది. అలాగే సిడి ప్లేయర్ దాన్ని మింగేసి మరింతగా సంగీతానికి దోహదపడింది. తర్వాత ప్రవేశించిన ఎఫ్ఎం రేడియో ఇటు రేడియోలోని సౌలభ్యాన్ని, అటు సిడి ప్లేయర్‌లోని నాణ్యతను అందివ్వగలిగింది. అదే సమయంలో రేడియోతో కలిసిపోయిన టెలిఫోన్- వినేవారికి కావాల్సిన సంగీతాన్ని తక్షణమే అందివ్వ గలిగింది. ప్రజల అభీష్టాన్ని గౌరవించడానికి టెక్నాలజీ దోహదపడింది.

ఇదంతా దృశ్యరూపం నోచుకోని సంగీత పరిస్థితికి వివరణ. ఘంటసాల హయాంలో టీవీలూ, వీడియో క్యాసెట్లు రాలేదు. సినిమా పాట అంటే ఆకాశవాణి, గాయనీగాయకులు, సినిమా పేరు, సినిమా దర్శకుడు అని మాత్రమే పరిచయం. కేవలం చెవి ద్వారా మనసులో గీతం బోధప డి అర్థపరిమళం బుద్ధిని సోకే వెసులుబాటు ఉండేది. రేడియో స్థానాన్ని టీవీ ఆక్రమించిన తర్వాత గాయనీగాయకుల స్థానాన్ని నటీనటులూ, సంగీత దర్శకుల స్థానాన్ని కెమెరామెన్ ఆక్రమించారని వ్యాఖ్యానించినా తప్పు లేదు.

రేడియో స్వర్ణయుగం తెలియని వారికి నేడు టీవీలో కనిపించే నృత్యభంగిమలే, వర్ణశోభితమైన దృశ్యాలే గుర్తుంటాయి. దృశ్యానికుండే శక్తి అంతటిది. అప్పటి పరిస్థితే ఘంటసాలకు గొప్పగా లాభించింది. ఆయన వేలాది పాటలు పాడకపోయినా విశేషమైన గుర్తింపు లభించింది. అదే సమయంలో గొప్పగా వృద్ధి చెందిన టెక్నాలజీ నేటి గాయనీ గాయకులకు ప్రతిబంధకంగా కూడా మారిపోయిందని ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు. పాశ్చాత్య సంగీతానికి టెక్నాలజీ తోడ్పాటు మరింత పెద్దది. టెక్నాల జీ లేకుండా పాశ్చత్య సంగీతాన్ని అసలు ఊహించలేము కూడా! రచన, గానం, నృత్యం, నృత్యదర్శకత్వం, సంగీత దర్శకత్వం అనేవి ఒకే వ్యక్తిలో కలిసిపోవడంతో పాటు మినుకుమనే, తళుకులూ, అలాగే సంగీతశాలలోని ఆధునికమైన సంగీతపు ఏర్పాట్లు విశేషంగా ఉంటాయి. అంతేకాదు గానం అనేది పరిసరాల మీదా, వాతావరణం మీద ఆధారపడుతుందని భావిస్తాడు. అందుకే ఉదయరాగాలు, సంధ్యారాగాలు అని వివరిస్తారు కూడా. ఇటువంటి పరిస్థితులను కృత్రిమంగా కల్పించే రీతిలో సంగీత ప్రదర్శనశాలలు రూపొందాయి.

కంప్యూటర్ రావడం, ఇంటర్‌నెట్ తోడవడం అనేది అగ్నికి ఆజ్యం పోయడం లాంటిదని చెప్పుకోవచ్చు. ఒక మహానది ద్వారా అనంత సాగరాన్ని చేరడం అనే భావన కూడా కలుగుతుంది. కంప్యూటర్ రాకతో సిడి, వీడియో, రేడియో, టీవీ, ఫోన్ అన్నీ కలగలిసిపోయాయి. మన దేశంలో ఇంకా కంప్యూటర్ చాలా మందికి అస్పృశ్యంగానే ఉంది. అక్షరాస్యత, ఆర్థిక పరిస్థితి ఇంకా అవరోధాలు గానే నిలిచి కంప్యూటర్‌ను దూరంగా ఉంచాయి. కంప్యూటర్, నెట్ ఎక్కువ మందికి చేరిననాడు మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. దానికి వాణిజ్యం తోడ్పడుతుంది.

మినీ ప్రపంచంగా మొబైల్ పుట్టుకురావడం మరో ప్రభంజనం. చాలా ఫలితాలను అరచేతిలో అలవోకగా సాధించగలగడం ఇందులోని మర్మం. సంగీతానికి సంబంధించి టెక్నాలజీ సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని, ప్రచారాన్ని, ప్రభావాన్ని విశేష రీతిలో సాధించగలిగింది. తాజా సాక్ష్యంగా చెప్పాలంటే టీవీ చానళ్ల ద్వారా వెలుగుచూసి, ప్రచారాన్ని పొందిన వర్ధమాన గాయనీ గాయకుల జాబితా గురించి పేర్కొనాలి. మరింత తాజా ఉదాహరణ ఏమిటి అంటే టీవీలో మారుమ్రోగుతున్న తెలుగు జానపద గీతాన్ని మీకు గుర్తు చేయాలి మరి!

-నాగసూరి వేణుగోపాల్

0 comments:

Post a Comment