ప్రభావం ఎంతని చెప్పడం?-14th jan,2011

on Wednesday, January 19, 2011

ఇరవయో శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక ప్రగతి అనూహ్యంగా ఉందని భావిస్తారు. గతం నుంచి వర్తమానంలోకి వస్తున్నప్పుడు ఈఅనూహ్యా లు వరసగా తారసపడతాయి. రేడియో, టెలివిజన్, సినిమా, టెలిఫోన్, ఉపగ్రహ కమ్యూనికేషన్లు, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ.. వంటి చాలా విభాగాలు ఇంతగా అభివృద్ధి చెందుతాయని, ఇంతగా ప్రభావాన్ని కలుగజేస్తాయని ఎవరూ ఊహించలేదు.

ఎలక్ట్రాన్‌ను ఆవిష్కరించిన జె.జె.థాంసన్ తన పరిశోధనకు ఫలితాలు పెద్దగా ఉండక పోవచ్చని భావించారు. కానీ పాదార్థిక పరిశోధనకు, ఎలెక్ట్రానిక్స్‌కూ తెరలేపింది ఈ ఎలెక్ట్రాన్ ఆవిష్కరణే! అలాగే గత దశాబ్దపు సాంకేతిక విజ్ఞాన ప్రభావాన్ని ఒక సారి అవలోకిస్తే-మరెంతో ఆశ్చర్యం కలుగుతుంది. అక్షరం చెరిగిపోలేదు గానీ అదృశ్య రూపంగా, అరూపంగా మారింది. ఉత్తరాలు, వ్రాత ప్రతులు తగ్గిపోయి మౌఖిక రూపంలో సాఫ్ట్ అవతారం ధరించింది. వివరంగా చెప్పాలంటే ఈ పదేళ్ళలో ఉత్తరాలు బాగా తగ్గిపోయాయి.

డిసెంబర్ నెల చివరి వారం అంటే తమకు ఉత్తరాల భారం పెరుగుతుందని పోస్టల్ శాఖ వారూ, ఆలస్యంగా వస్తాయని ప్రజలు ఆందోళన పడేవారు. ఆ స్థాయిలో గ్రీటింగ్ కార్డుల హడావుడి ఉండేది. ఇపుడంత లేదు. కానీ ఈ భారం నేడు సెల్ ఫోన్, ఇంటర్నెట్‌ల మీద పడింది. కంప్యూటర్, ఇంటర్నెట్‌కు సంబంధించి చాలా గొప్ప ఫలితం, ఎక్కువ ప్రయోజనకరమైన విశేషం- ఈ మెయిల్. ఎటువంటి జాప్యం లేకుండా సమాచారం పంపడమే కాదు, మన సమాచా రం మన దగ్గరే భద్రంగా ఉంచుకుని-కావాల్సిన వాళ్ళకు క్షణంలో పంపవచ్చు.

మరో రకంగా జిరాక్స్ ఖర్చును తగ్గించింది. ఇక షార్ట్ మెసేజ్ సర్వీ స్ (ఎస్ఎమ్ఎస్)తో సమాచారం కచ్చితంగా, త్వరగా అరచేతిలో వాలడం మన దేశానికి ఈ దశాబ్దపు వింతే! అదే సమయంలో ఇంగ్లీషు భయంకరంగా రూపు కోల్పోతున్నదని భాషా వేత్తలు ఆందోళన పడుతున్నారు. తెలుగు ఇంకా కంప్యూటర్ భాషగా విస్తరించలేదు కనుక, మనకా సమస్య లేదు. తెలుగు భాషకు ఇంత స్థాయిలో సాంకేతిక పుష్టి లభించినప్పుడు మనం ఇంకెంత స్థాయిలో తెలుగును దోష భూయిష్టం చేస్తామో తేలీదు! సరళీకరణ, ఉదారీకరణ ఫలితాలు వెల్లువయ్యింది - ఈ దశాబ్దంలోనే.

విమాన ప్రయాణం ఇదివరకు కాల్పనిక రచనలలో కూడా తక్కువగా ఉం డేది. కానీ నేడు అది చాలా సామాన్యమైపోయింది. అంతేకాదు, విదేశాలకు పోక, తర్వాత బంధువులు పోయి రావడాలు, అక్కడి పరికరాలు వగైరా గమనించడాలు, ఇక్క డ కూడా అలాంటివి రావాల ని కోరుకోవడాలు బాగా పెరిగింది. స్వంత వాహనాలు విషయానికి వస్తే 20వ శతా బ్దం చివరి దశాబ్దంలో స్కూటర్ పాతబడి పోయింది. ఈ దశాబ్దంలో కారు సహజమైపోయింది. లక్ష రూపాయలకు నానో కారు అనే విషయాన్ని సంచలనాత్మకంగా చర్చించారు. చర్చ ఉన్న స్థాయిలో కారు లేదన్నది వేరే విషయం.

అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలాగానే కంప్యూటర్ ఖరీదు తగ్గింది. ఈ విషయం చెప్పుకుంటున్నప్పుడు ఎటిఎంల గురించి చెప్పుకోకపోతే బావుండదు. ఎప్పుడు బడితే అప్పుడు, ఎక్కడ బడితే అక్కడ -బ్యాంకులో డబ్బులుంటే చాలు రాల్చుకోవచ్చు శ్రమ లేకుండా. ఇటువంటి దానికీ పాస్‌బుక్కు, చెక్కు, బ్యాంక్ టైమింగ్స్, వెయిటింగ్ విసుగు వంటి వాటితో కలసిన రోజులను పోల్చుకోండి -అప్పుడు తెలుస్తుంది టెక్నాలజీ సౌఖ్యం! సరిగ్గా ఇటువంటిదే టీవీ వినోదం. ఎటువంటి శ్రమ లేకుండా, ఖర్చు లేకుండా, కాలయాపన లేకుండా 'కావాల్సింది కావాల్సినంత' అనే స్థాయి లో టీవీ వినోదం విచ్చల విడిగా లభిస్తోంది.

దీన్నయితే అసలు ఊహించలేదు. దేశంలో ఐదువందలకు పై చిలుకు - ఒక లెక్కింపు ప్రకారం 503 - రకరకాల చానళ్ళతో ముందు ముందు 'టీవీ వైరాగ్యం' కూడా విరివిగా పల్లవించే పరిస్థితి రావచ్చు. టెక్నాలజీ వినియోగం బాగా పెరిగి, వీటి రూపకల్పనకు మూల భూతమైన విజ్ఞాన భావనలు, శాస్త్రీయ అభినివేశం పూర్తిగా అంతరించి పోయిందేమో అనే భయం కలుగుతుంది. శాస్త్రీయ దృష్టి సరే, ఇంగితం కూడా అంతర్ధానం అవుతోందనే భయం కలుగుతోంది.

ఇది ఒక వైపుకాగా, మరో వైపు ఆత్మ విశ్వాసం క్లాసులతోపాటు దేవాలయాలు, పూజలు, మొక్కులు వగైరాలు కూడా మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంతకుమించి విగ్రహాలు, బొమ్మలు, ఆచారాలు మరింతగా జనంలోకి చొచ్చుకువచ్చాయి. టెక్నాలజీ వాడకం పెరిగితే, దాని ద్వారా తారసపడే మోసాలు కూడా పెద్ద స్థాయిలో ఉంటున్నాయి. పురుషులందు పుణ్య పురుషులు వేరయా - అన్నట్టు నేరాలలో సైబర్ నేరాలు గొప్పవయా -అని చెప్పుకోవాలి. వీటిలో ప్రక్రియ ఎంత సరళంగా, లాఘవంగా ఉంటుందో జరిగే మోసం అంత భారీ స్థాయిలో ఉంటోంది.

అంతకుమించి సృజనాత్మకంగా ఉంటుంది. నిజానికి దీని గురించి ఎక్కువ చర్చిస్తే టెక్నాలజీ అంటే భయం పెరుగుతుందని భావించే వారు కూడా ఉన్నారు. నిజానికి సైబర్ నేరాలకు అవసరమైన చట్టాలు మరింత పకడ్బందీగా ఏర్పడుతున్న కాలమిది. వీటన్నిటితో పాటు, ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పట్ల విపరీతమైన మోజు పెరిగి మౌలిక విజ్ఞాన అంశాల పట్ల గౌరవం, అభిమానం తగ్గడం ఆందోళన కల్గిస్తోంది. బి.టెక్ వైపు ఉన్న హడావుడిలో బియస్సి వైపు దాదా పు లేదని డిగ్రీ కోర్సుల వివరాలు చెబుతున్నాయి

. ఇలా జరగడం ముందు ముందు మౌలిక పరిశోధనలనే దెబ్బతీస్తుంది. అందుకే పిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తి కల్గించాలనే కొంత ప్రయత్నం ఈ దశాబ్దంలో పెరిగింది. జాతీయ స్థాయిలో పేరొందిన ప్రయోగశాలలను చూసే అవకాశం ఇప్పుడు కల్గిస్తున్నారు. ఫలితంగా సైన్స్ పట్ల మరింత మక్కువ పెరగగలదని నమ్మకం. ఇక చివరగా తెలుగు పత్రికలలో పాపులర్ సైన్స్, సైన్స్ అంశాల శీర్షికలు, సమాచారం బాగా తగ్గిపోయింది ఈ దశాబ్దంలోనే.

సైన్స్ పుస్తకాల అమ్మకాలు గణనీయంగా తగ్గకపోయినా -పత్రికలలో సైన్స్ సమాచారం బాగా తగ్గిపోయింది. కేవలం వాణిజ్యపు లంకె ఉండే టెక్నాలజీ అంశాలు, కన్స్యూమర్ గూడ్స్ వంటి వాటికి సంబంధించి సమాచారం ఇస్తున్నారు. అలాగే వైజ్ఞానిక కల్పనా సాహిత్యానికి సంబంధించి తెలుగులో ఈ దశాబ్దంలో వచ్చిన చెప్పుకోదగ్గ రచనలు పెద్దగా లేవు.
-డాక్టర్ నాగసూరి వేణుగోపాల్

0 comments:

Post a Comment