ఎగిరెను తెలుగు బావుటా

on Sunday, August 22, 2010

దేశంలో మరే ఇతర భారతీయ భాషా పత్రికలకు తీసిపోని రీతిలో తెలుగు పత్రికా ప్రపంచం వెలుగొందుతోంది. చాలా రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్న హిందీ పత్రికలు 90వ దశకం నుంచే పలు రకాలుగా వృద్ధి చెందాయి. అందుకు భిన్నంగా దక్షిణాది పత్రికలు ముప్ఫై ఏళ్ళుగా వృద్ధి చెందాయి. అందువల్ల ఉత్తరాది పత్రికలకన్నా దక్షిణాది పత్రికలే మిన్న అని భావించడం కద్దు. గతంలో మలయాళ, తమిళ పత్రికలు తెలుగు పత్రికల కన్నా ఎక్కువ ప్రతులు అమ్ముడుపోయేవి. కానీ నేడు మలయాళం తర్వాత తెలుగు ఆ స్థానం ఆక్రమించింది. ఇంగ్లీషు పత్రికలతో పోలిస్తే అవి దేశ వ్యాప్తంగా అమ్ముడుపోయినా వాటి సర్క్యులేషన్ మరెంతో గణనీయంగా ఎక్కువ కాదు. ఎక్కువ క్రియాశీలకంగా, సృజనాత్మకంగా, రంగుల హంగులతో ఆకర్షణీయమైన లే-అవుట్‌తో, మంచి ఫొటోలతో ఆసక్తికరమైన శీర్షికలతో చొచ్చుకొని పోతున్న పత్రికలు తెలుగు పత్రికలే. అలాగే మండల స్థాయిలో విలేకరులు కల పత్రికలు కూడా దేశంలో తెలుగువే అని చెప్పుకోవాలి. అదే సమయంలో రాజకీయాలను ఎక్కువ ప్రభావితం చేస్తున్న పత్రికలు కూడా తెలుగు పత్రికలే. శాసనసభలో చాలా సందర్భాల్లో తెలుగు పత్రికలు ప్రదర్శింపబడుతూ చర్చలు కొనసాగడానికి, మలుపు తిరగడానికి దోహదపడుతున్నాయి.

ఐదు దశాబ్దల కిందట పత్రికల నిర్వహణలో వృత్త్ధిర్మం కాకుండా, ఉద్యమస్ఫూర్తి ఊతంగా ఉండేది. కానీ నేడు వృత్తి ధర్మం అంతరించి వ్యాపార పోకడగా మారిపోయింది. సామాజిక సేవ స్థానంలో రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు స్థిరపడ్డాయని విమర్శలు పెరిగాయి. ఈ రెండు దశల మధ్య చాలా మలుపులు ఉన్నాయి. మేమిచ్చినవే వార్తలు, మీ ఆసక్తితో మాకు పనిలేదు. అలాగే మేము పంపినప్పుడే మీరు పత్రిక చదవండి- అనే పరిస్థితులు పూర్తిగా అంతరించిపోయాయి. నిస్తేజంగా, నిర్లిప్తంగా సాగే భాష స్థానంలో అభివ్యక్తి బలంగా ఉండే భాష తయారైంది. ఈ తెలుగు భాషలో ఇంగ్లీషు చేరిపోయిందన్న విమర్శ కూడా ఉందని ఒప్పుకోవాలి. కానీ, వాస్తవానికి వ్యక్తీకరణ అత్యంత ఆకర్షణీయంగా మారింది. అలాగే పత్రికలు విద్యకోసం, సామాజిక అవగాహన కోసం అనే పరిస్థితి దాటి వినియోగం, వినోదం, వాణిజ్యం అనే స్థాయిలో అంశాలు రూపొందాయి. ఒకప్పుడు ఆదివారం అనుబంధం అంటే కళ, సాహిత్య, విజ్ఞాన, సాంస్కృతిక వేదిక అనే రీతిలో ఉండేది. ఇప్పుడు కన్య్సూమర్ గైడ్‌లాగా మారిపోయాయి. పాఠకులను ఆకర్షించడానికి తక్కువ నిడివిలో శీర్షికలు, ఆకర్షించే రంగులు, అంత్యప్రాసలు తయారయ్యాయి. కించిత్ అశ్లీలంగా కూడా పరిణమించాయని మరో విమర్శ ఉంది. అంటే వందశాతం డైనమిక్‌గా పత్రికా రంగం మారిపోయింది. ఇందులో పత్రికలు పెరగటం, పత్రికలు ప్రచురించే పుటలు పెరగటం, పత్రికలు ప్రచురించే అంశాలు పెరగడం, అమ్మకమయ్యే ప్రతుల సంఖ్య పెరగడం విశేషం. ఐదు దశాబ్దాల కిందట లక్ష ప్రతుల సంఖ్య అంటే ఎంతో గగనంగా ఉండేది. మూడు దశాబ్దాల కిందట మలయాళ మనోరమ ఐదు లక్షల సర్క్యులేషన్ అని గొప్పలు చెప్పేవారు. కానీ నేడు తెలుగులో రెండు పత్రికలకు పది లక్షలు మించిన సర్క్యులేషన్ ఉందనేది రేపు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఎ.బి.సి) వెల్లడి చేయబోయే విశేషం. పత్రికలోని అంశాలకన్నా అమ్మకాల్లో పాటించే నైపుణ్యమే కీలకమని విజయవంతమైన పత్రికలు చెబుతున్నాయి.
దేశంలో ఏభాషలోలేని రీతిలో మండల స్థాయిలో విలేఖరులను కలిగి ఉండడం తెలుగు పత్రికల విశేషం. విలేఖరి స్థానిక వార్తలు పంపడమే కాక, పత్రిక అమ్మకాలు, వాణిజ్య ప్రకటనల సేకరణ కూడా పర్యవేక్షించడం ఒక వాస్తవం. సరైన పాత్రికేయ శిక్షణ లేని గ్రామీణ విలేఖరి అధికార వర్గాల చెంత మసిలే అవకాశం రావడంతో కొన్ని అనర్థాలు తప్పక చోటుచేసుకుంటాయి. అయినా కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆలవాలమైన వికేంద్రీకరణ వాంఛనీయ పరిణామం. దీనికి తగిన స్థాయిలోనే నేడు ప్రతి పత్రికా జిల్లా అనుబంధాలను ప్రత్యేకంగా ప్రచురిస్తున్నాయి. ఈ పరిణామ ఫలితంగా పత్రికలకు ఆర్థిక వనరులు పెరగడంతోపాటు విమర్శల తాకిడి కూడా ఎక్కువైంది.
ఒకప్పుడు సినిమా వార్తలు కావాలంటే ఆదివారందాకా వేచి ఉండాల్సి ఉండేది. అయితే నేడు ప్రతి దినపత్రిక సినిమా వార్తలకోసం ఒకట్రెండు పేజీలు కేటాయించడం పరిణామమే. అంతేకాకుండా చాలా దినపత్రికలు సినిమా వారపత్రికలు ప్రారంభించడం కొంతకాలం క్రితం ఆనవాయితీగా మారింది. తర్వాతి కాలంలో ఎన్టీ రామారావు రంగ ప్రవేశం, టీవీ ప్రభావం కారణంగా సినిమా వార్తలు తొలి పేజీని ఆక్రమించడం సహజమైపోయింది. బాలల కోసం ప్రత్యేకంగా పత్రికలు కొనడం కానీ, నడపడం కానీ అవసరం లేకుండా దినపత్రికలే ఈ అంశాలు కూడా ఇవ్వడం ఇంకో మార్పు. ఇక ఆదివారం సంచికలు వారపత్రికల సైజులోకి మారడంతోపాటు అందులో అంశాలు కూడా ఒకప్పటి వార పత్రికల చట్రంలో ఒదిగిపోవడం ఇంకో విశేషం. అదే సమయంలో కొందరు మాత్రమే చదివే ‘ఓ రకం అంశాలు’ సచిత్ర వారపత్రికల్లో కలిసిపోవడం ఇంకో వాస్తవం. ఆరోగ్యం పేరున నిర్వహించబడే శీర్షికలు సైతం ఈ కోవలోకే వస్తాయి. గతంలో దినపత్రికలంటే డెమీ సైజు, వారపత్రికలంటే 1/4 డెమీ, మాసపత్రికలంటే 1/8 డెమీ అనే సంప్రదాయం ఉండేది. కానీ నేడు దినపత్రికలే కొన్ని పేజీలు డెమీ, మరికొన్ని పేజీలు 1/2 డెమీ, ఇంకొన్ని పేజీలు 1/4 డెమీలో ప్రచురిస్తున్నాయి. ఇతర రకాల పత్రికలకు అంతర్భాగంగా దినపత్రికలు చేసుకున్నాయనడానికి ఇదో దాఖలా. పత్రిక అనగానే ఒకప్పుడు ఆ పత్రిక సంపాదకుడు గుర్తుకు వచ్చేవారు. కానీ నేడు ఆ పత్రిక యజమాని గుర్తుకు వస్తున్నారు. పత్రికల ద్వారా వాణిజ్యం చేసుకుంటున్నారనే విమర్శలు నేడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ, కాస్త తరచి చూస్తే ఆంధ్రపత్రికను కాశీనాథుని నాగేశ్వరరావుపంతులు అమృతాంజనంతో, గృహలక్ష్మి పత్రికను డాక్టర్ కె.ఎన్.కేసరి లోధ్ర అమ్మకాలతో, కినె్నర సంపాదకుడు పందిరి మల్లికార్జునరావు రీటా అమ్మకాలతో నడిపారనేది ఒక వాస్తవం. అయితే తేడా ఏమిటంటే వారు వాణిజ్యం చేసి లాభాలు గడించి పత్రికలు నిర్వహించారు. కానీ నేడు పత్రికలు ప్రారంభించడానికి ముందుకు వచ్చిన /వస్తున్న వాణిజ్యవేత్తల లక్ష్యాలు వేరుగా ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే పత్రికలు వార్తాంశాల్ని ఎంపిక చేయడం, అలంకరించడం జరుగుతోంది. అదే సమయంలో ఈ మార్పులతోపాటు సంపాదకుడి స్థానం కుంచించుకుపోవడం ఇంకో పరిణామం. 1976లో తన ‘మూడు దశాబ్దాలు’ సంపాదకీయాల సంకలనానికి ముందుమాట రాస్తూ నార్ల వెంకటేశ్వరరావు ఇలా అంటారు- ‘‘కారణాలేవైనా నేటి సంఘంలో సంపాదకునికి, అతడి సంపాదకీయాలకు పూర్వపు గౌరవ ప్రతిష్టలు లేవు. నా జీవిత కాలంలో సంపాదకుని ప్రతిపత్తి ఇంతగా దిగజారిపోవడం నాకు మరింత బాధాకరం. ఈ శోచనీయ పరిణామానికి నా స్వల్ప పరిధిలో, నా బాధ్యత ఏపాటిదన్న ఆత్మసంశోధన ఇటీవల నన్ను ఎక్కువగా కృంగదీస్తున్నది’’. మరి ముప్ఫై మూడేళ్ళ తర్వాత సంభవించిన విపరిణామాలకు ఎలా వ్యాఖ్యానించాలో కాలం ముందు ముందు నిర్ణయిస్తుంది.
ముఖ్యంగా గత పది, పదిహేనేళ్లుగా టి.వి చానళ్లు, వార్తా చానళ్లు తెలుగులో మూడు పదులు దాటి విస్తరించడంతో తెలుగు పత్రికలు కూడా విశేషంగా మార్పునకు లోనయ్యాయి. ఎప్పటికప్పుడు సంభవించిన విశేషాలను- వార్తలైనా, కాకపోయినా- మరింత మసాలా కలిపి చానళ్లు ఇస్తున్నప్పుడు మరుసటి రోజు పత్రికలు ఏమివ్వాలి అనే మీమాంస కొంతకాలం క్రిందట జరిగి, ఇప్పుడు పరిస్థితి తేటపడింది. సంఘటనల వెనుక ఉండే నేపథ్యాలను కథనాలుగా అలంకరించడం నేటి పత్రికల విధానం. ఆ కథనాలు ఆధారంగా చర్చలు కొనసాగించడం టి.వి చానళ్ల తంతు. అదే సమయంలో వార్తా చానళ్ళు ఇచ్చే పొట్టి, తక్షణ వార్తల ఆధారంగా కథనాలు సిద్ధం చేసుకోవడానికి పత్రికలు ఎంతో శ్రమిస్తున్నాయి. ఈ సరళమైన పరిణామం వెనుక మరో పెద్ద మార్పు జరుగుతోంది. అనివార్యంగా టి.వి చూడక తప్పని పరిస్థితి పాత్రికేయుల, సంపాదకుల మేధో, సృజనాత్మక సామర్థ్యాల విస్తృతికి పెద్ద అవరోధంగా మారిపోయింది.
పత్రికా రంగంలో కంప్యూటర్, ఉపగ్రహం వంటి వెసులుబాట్లతో తాజా వార్తలు తెల్లవారుజాముదాకా ఇవ్వవలసిన పరిస్థితి రావడంతో పాత్రికేయుల ఆరోగ్యం బాగా దెబ్బతినే ప్రతికూల పరిస్థితి దాపురించింది. అంటే మానసిక, శారీరక ఆరోగ్యాలు తీవ్రమైన ఒత్తిడికి లోనుకావడమే. అదే సమయంలో మరో విశేషాన్ని కూడా చర్చించుకోవాలి. ఆసక్తితో, ఆర్తితో సమాజానికి ఏదో చేయాలనే లక్ష్యంతో తక్కువ జీతానికైనా పాత్రికేయులుగా ప్రవేశించాలనే వారి సంఖ్య నేడు బాగా తగ్గిపోయింది. బాగా జీతాలు ఉన్న వృత్తి ఇప్పుడు జర్నలిజం కూడా అని ఒప్పుకోవాలి. అయితే జీతం పెరిగిన స్థాయిలో మేధస్సు, సృజన, భాష, శైలి పెరిగాయనే దాఖలాలు లేవు. నిజానికి భారతదేశమంతటా పతనమవుతున్న పాత్రికేయ రచనల స్థాయి ఒకేలా ఉంది. ఇది వాంఛనీయమైన పరిణామం కాకపోయినా అనివార్యమైన పరిస్థితిగా మారింది. తమ యజమానులకు దోహదపడే, లేదా తమ ఉద్యోగ ఉన్నతికి తోడ్పడే వాదనలను సమాజానికి అవసరమైన ఔషధాలుగా పత్రికా ప్రముఖులు తమ రచనల ద్వారా ఇవ్వడానికి సిద్ధమవడం ఇంకో విపరిణామం. అందువల్లనే పాత్రికేయులకు సంబంధించి రకరకాల అవినీతి ఆరోపణలు వినబడుతుంటాయి. కేవలం వార్తను నివేదించే పాత్రికేయుడే ఈ స్థాయిలో ఉంటే యజమాని గురించి చెప్పనక్కరలేదు. పత్రికా సంస్థలు విశేష రీతిలో భూమి వంటి వనరులను విపరీతంగా సేకరిస్తున్నాయని దేశవ్యాప్తంగా విమర్శలు వినబడుతున్నాయి. అందుకే సమాచార హక్కు పరిధిలోకి మీడియా సంస్థలను, వ్యక్తులను తీసుకురావాలని కొందరు బలంగా వాదిస్తున్నారు.
పత్రికలు ఇంత విస్తరించినా, ఇంత రీతిలో ప్రభావం చూపినా తగిన స్థాయిలో జర్నలిజం విద్య తెలుగులో రూపుదాల్చకపోవడం ఇంకో విషాదం. జర్నలిస్టులకు అవసరమైన పుస్తకాలు గత పదేళ్లలో కొన్ని వచ్చాయిగానీ, అంతకుముందు అటువంటి సౌకర్యాలు లేనే లేవు. అకడమిక్‌గా అవకాశాలు లేకుండా సరైన పుస్తకాలు లేకుండా సగటు యువకుడు పాత్రికేయుడుగా ఎదగడమనేది మామూలు విషయం కాదు. ఇటీవల కాలంలో డిగ్రీ స్థాయిలో పాఠ్యాంశంగా జర్నలిజం బోధించాలనే ప్రయత్నాలు యూనివర్సిటీల్లో పెరిగాయి. ఇంకో తమాషా ఏమిటంటే జర్నలిజం అభ్యసించిన ఎంతోమంది పాత్రికేయ వృత్తిలో ప్రవేశించకుండా పబ్లిక్ రిలేషన్ అధికారులుగా వలసపోవడం లేదా ఈవెంట్ మేనేజర్లుగా స్థిరపడిపోవడం, జర్నలిజం వృత్తిని విడనాడి వాణిజ్యంలో ప్రవేశించడం ఇటీవలి పరిణామం.
ఐదు దశాబ్దాల్లో ఆంధ్రపత్రిక, ఆంధ్ర సచిత్ర వారపత్రిక, భారతి, యువ, జ్యోతి, సినిమారంగం, విజయచిత్ర, ఉదయం సంస్థ పత్రికలు, సినీ హెరాల్డ్, ఆంధ్రప్రభ వారపత్రిక, ఆంధ్రజ్యోతి వారపత్రిక, ఆదివారం ఇలా ఎన్నో పత్రికలు మూతపడ్డాయి. ఇప్పుడు చలామణిలో ఉన్న పత్రికల్లో చాలా పత్రికలు ఈ ఐదు దశాబ్దాల్లో ప్రారంభమైనవే. అలాగే ఒకప్పుడు తెలుగువారు ఆంగ్ల పత్రికా రంగంలో తేజోవంతంగా రాణించారు. కానీ నేడు ఢిల్లీ స్థాయిలో తెలుగు వెలుగులు ప్రకాశించడం లేదు.
ఇటీవల కాలంలో పత్రికల బాగోగులు పరిశీలించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అంబుడ్స్‌మన్ వ్యవస్థను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రారంభించి కొంతకాలం కొనసాగించింది. హిందూ దినపత్రిక రీడర్స్ ఎడిటర్‌ను, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక కరెక్షన్స్ ఎడిటర్‌ను కలిగి ఉన్నాయి. కానీ ఏ తెలుగు దినపత్రిక ఈ దిశలో ప్రయత్నించలేదు. ఆంగ్ల పత్రికలను శాసిస్తున్న తక్కువ ధర అనేది తెలుగు పత్రికలు ఇంకా పూర్తిగా స్వీకరించలేదు. అయితే తొలి పుట మొత్తం ప్రకటనలివ్వడం అనే వాణిజ్య పోకడను మాత్రం ఆంగ్ల పత్రికల నుంచి ఇష్టంగా తెలుగు పత్రికలు స్వీకరించాయి.
జర్నలిజం అంటే వడివడిగా చరిత్ర రాయడమనే అభిప్రాయం ఉండేది. కానీ నేడు జర్నలిజమే వడివడిగా మారిపోయింది. ప్రపంచాన్ని అన్ని రకాలుగా ప్రభావితం చేసి శాసించాలనుకునే మీడియా మాత్రం సరైన విమర్శ లేకుండా ఉండిపోతోంది. అందుకే మీడియాకు ఆత్మవిమర్శ అవసరమని భావిస్తున్నారు. నియంత్రణ ఉండాలా, వద్దా, ఉంటే స్వయం నియంత్రణలో ఉండాలా అనేది టి.వి చానళ్ళ సమస్య. కానీ పత్రికా ప్రపంచం టి.వి. చానళ్లకన్నా చాలా వ్యవస్థీకృతమై వృద్ధి చెందుతోంది. అయితే ఔషధం లాంటి విమర్శ, పథ్యంలాంటి ఆత్మవిమర్శను పత్రికాలోకం ఇంకా అలవాటు చేసుకోవాల్సి ఉంది.

3 comments:

హను said...

nice.... one

karlapalem Hanumantha Rao said...

చాలా విలువయిన సమాచారాన్ని సాధారణ పాఠకుల దృష్టి కి తీసుకు వస్తున్నారండి!

Nagasuri said...

dhanyavadalu

Post a Comment